logo

కొవిడ్‌ పరీక్షల లక్ష్యం 1,200

కరోనా మూడో దశ (ఒమిక్రాన్‌) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ ప్రమాదకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ రేట్‌ తగ్గుతుందని భావించిన అధికారులు..

Published : 20 Jan 2022 01:28 IST

సగటున 200 మంది నమూనాల సేకరణ.. ●

బాధితులకు ఔషధాల కిట్ల పంపిణీ

న్యూస్‌టుడే-మెదక్‌, నర్సాపూర్‌


నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలకు బారులు

కరోనా మూడో దశ (ఒమిక్రాన్‌) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ ప్రమాదకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌ రేట్‌ తగ్గుతుందని భావించిన అధికారులు.. నిత్యం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం 50 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. అందుకు తగ్గట్టుగా ముందుకు రాకపోవడంతో కొంత మందికే పరీక్షలు చేసి పంపుతున్నారు. మరో వైపు పాజిటివ్‌ వచ్చిన వారికి ఔషధాల కిట్‌ను అందజేస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట ఆసుపత్రుల పరిధిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఈనెలలో ఇప్పటివరకు 376 మందికి పాజిటివ్‌ రావడం గమనార్హం. ప్రస్తుతం పలువురిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం కారణంగా కొంత వరకు ఇతరులకు వైరస్‌ సోకుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అన్ని పీహెచ్‌సీల్లోనూ..

జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక పట్టణ ఆరోగ్యకేంద్రం ఉండగా, రెండు ప్రాంతీయ, రెండు సామాజిక ఆసుపత్రులలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌టీ-పీసీఆర్‌ నమూనాలను సేకరిస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీలో నిత్యం 50 మందికి పరీక్షలు చేయాలని సూచించారు. ప్రస్తుతం 55 వేల ర్యాపిడ్‌ కిట్లు ఆయా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా నిత్యం 1,200 మందికి పరీక్షలు చేయాలి. కాగా సగటున 200 మందికి నిర్వహిస్తున్నారు. మరికొందరు ఫలితాల కచ్చితత్వం కోసం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. మెదక్‌లోలోని ఆర్‌టీ-పీసీఆర్‌ కేంద్రానికి రోజుకు వందకు పైగా నమూనాలు వస్తున్నాయి. ఇవే కాకుండా పీహెచ్‌సీలలో సేకరించిన నమూనాలను ఇక్కడికి పంపుతున్నారు. ఈ కారణంగా పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ పరీక్షలు తగ్గుతున్నాయి. మరోవైపు పీహెచ్‌సీల్లోనే కాకుండా ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో పనిచేసే ఏఎన్‌ఎంలకు సైతం ర్యాపిడ్‌ కిట్లను అందజేస్తున్నారు. వారు సైతం క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు అక్కడికక్కడే పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నారు. ర్యాపిడ్‌ ద్వారా ఫలితాలు సత్వరమే వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ పరీక్షలు చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.

పలు రకాల ఔషధాలతో..

పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్తున్నారు. పరీక్షల సమయంలో పూర్తి చిరునామా, చరవాణి నంబరు తదితర వివరాలు అందజేయడంతో బాధితులకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఔషధాల కిట్లను అందజేస్తున్నారు. వివిధ రకాల మందులతోపాటు వాటిని వాడుకునే తీరు తెలియజేసే కరపత్రాన్ని కిట్‌లో ఉంచారు. ఐదు రోజులకు సరిపడా ఔషధాలు ఉన్నాయి. జిల్లాలో 24 ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో పాజిటివ్‌ వచ్చిన వారికి కిట్‌ను పంపిణీ చేస్తున్నారు.


ఎక్కడా కొరత లేదు..

- వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. లక్షణాలు ఉన్నవారు నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచిస్తున్నాం. చాలామంది ముందుకు రావడం లేదు. జిల్లాలో ర్యాపిడ్‌ పరీక్షల కిట్ల కొరత లేదు. అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయి. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు బాధితుల ఇంటికి వెళ్లి ఔషధాల కిట్లను అందిస్తున్నారు. ప్రస్తుతం 35 వేలు అందుబాటులో ఉన్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారు ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.


జిల్లాలో ఇలా...

(2020 మార్చి నుంచి ఈనెల 18 వరకు)

కోలుకున్న వారు 15,264

ఆర్‌టీ-పీసీఆర్‌.. 6,249

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు: 424

ర్యాపిడ్‌ నిర్ధారణ పరీక్షలు

2,49,376

మొత్తం పాజిటివ్‌ కేసులు

15,781

మృతులు: 93


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని