logo

తేలిపోయిన నాణ్యత..!

తూప్రాన్‌ ప్రధాన రహదారి విస్తరణ పనులు ముణ్నాళ్ల ముచ్చటగా మారాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించగా దశాబ్దాల కాలం వరకు మన్నిక ఉండాల్సిన రోడ్డు అప్పుడే నాణ్యత తేలిపోతోంది. పురపాలిక పరిధి కరీంగూడ నుంచి అయ్యప్ప ఆలయం వరకు రూ.7.90 కోట్లతో గతంలో పనులు చేపట్టి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు.

Published : 20 Jan 2022 01:28 IST

తూప్రాన్‌లో ప్రధాన రహదారి దుస్థితి

న్యూస్‌టుడే, తూప్రాన్‌

తూప్రాన్‌ ప్రధాన రహదారి విస్తరణ పనులు ముణ్నాళ్ల ముచ్చటగా మారాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించగా దశాబ్దాల కాలం వరకు మన్నిక ఉండాల్సిన రోడ్డు అప్పుడే నాణ్యత తేలిపోతోంది. పురపాలిక పరిధి కరీంగూడ నుంచి అయ్యప్ప ఆలయం వరకు రూ.7.90 కోట్లతో గతంలో పనులు చేపట్టి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు. ఆ సమయంలో అధికారులు సరిగా పర్యవేక్షించకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారం పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 44వ జాతీయ రహదారి వైపు నుంచి పట్టణంలోకి వచ్చే దారిలో కరీంగూడ, రావెళ్లి సమీపంలో భారీ గుంతలతో వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. పోతరాజ్‌పల్లి వద్ద తూప్రాన్‌కు వచ్చే దారిలో రోడ్డు పూర్తిగా అతుకులమయంగా తయారైంది. రోడ్డు వేసే సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కాల్వల మాదిరిగా ఏర్పడ్డాయి. దీంతో వర్షం కురిసినప్పుడల్లా నీళ్లు నిలిచి ద్విచక్ర వాహన చోదకులు అదుపుతప్పి కింద పడుతున్నారు. ఇక్కడ వంద మీటర్ల మేర ఇదే పరిస్థితి ఉన్నా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఈ రహదారిపై ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సంగారెడ్డి వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విభాగిని వద్ద రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాల్సి ఉండగా వాటిని అప్పటి నుంచి అలానే వదిలేశారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కరీంగూడ వద్ద ప్రధాన రహదారిపై గుంత ఇలా..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది తూప్రాన్‌ ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంత. డివిజన్‌ కేంద్రంలో మూడేళ్ల క్రితం రూ.కోట్లు వెచ్చించి రహదారి నిర్మించగా అప్పుడే గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టణంలోని గీతారెడ్డి కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై రెండేళ్లుగా ఈ గుంత ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాత్రిళ్లు గుంత కనిపించక వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.


మరమ్మతులు చేయిస్తాం..

- శ్రీనివాస్‌, డీఈ, ర.భ.శాఖ, తూప్రాన్‌

తూప్రాన్‌ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు త్వరలో మరమ్మతులు చేయిస్తాం. మొదటిసారి పనులు చేసిన గుత్తేదారు రెండేళ్ల వరకు మాత్రమే మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక నిధులతో మరో గుత్తేదారుతో మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం. ఫిబ్రవరి రెండో వారంలోపు పనులు పూర్తి చేస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని