Crime News: అమీన్‌పూర్‌లో విషాదం... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య

వారిద్దరి కులాలు వేరయినా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు... రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన

Updated : 21 Nov 2022 16:18 IST

అమీన్‌పూర్‌: వారిద్దరి కులాలు వేరయినా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు... రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా ఏడేళ్ల చిన్నారితో కలిసి తల్లి నురగలు కక్కుతూ మంచంపై విగతజీవులుగా కనిపించగా..  తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

అమీన్‌పూర్‌ వందనపురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌, ఆల్వాల్‌కు చెందిన అనామిక పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి స్నిగ్ధ అనే ఏడేళ్ల కుమార్తె కూడా ఉంది. శ్రీకాంత్‌ గౌడ్‌(42) టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా, అనామిక(40) స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారంలో ఏమైందో తెలియదు గానీ.. రెండు రోజుల నుంచి వారు కనిపించలేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అతను వందనపురి కాలనీలోని శ్రీకాంత్‌ నివాసానికి వచ్చి చూడగా తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా.. స్నిగ్ధ ఆమె తల్లి అనామిక నురగలు కక్కి విగతజీవులుగా మంచంపై కనిపించారు. పక్క గదిలో శ్రీకాంత్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అయితే, వారి నుదుటన ఎర్ర బొట్లు ఉండటం, దేవుని గదిలో చిత్ర పటాలు బోర్లించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని