logo

పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టాలి: పాలనాధికారి

కరోనా నియంత్రణకు శుక్రవారం నుంచి జిల్లాలో ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పాలనాధికారి హరీష్‌ ఆదేశించారు. గురువారం ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

Published : 21 Jan 2022 02:13 IST

మెదక్‌, న్యూస్‌టుడే: కరోనా నియంత్రణకు శుక్రవారం నుంచి జిల్లాలో ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పాలనాధికారి హరీష్‌ ఆదేశించారు. గురువారం ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన దూరదృశ్య సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌, వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాలు, పురపాలికల్లో రోజుకు 30 నుంచి 60 ఇళ్లను బృందాలు సందర్శించి పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాలకు 35 వేల కిట్లు సరఫరా చేశామని, మరో 40 వేలు శుక్రవారం జిల్లాకు రానున్నాయని, మందుల కొరత లేదని స్పష్టంచేశారు. సర్వేలో ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములు కావాలన్నారు. రెండో డోసు వ్యాక్సిన్‌ శతశాతం పూర్తిచేయడంతో పాటు ముందు వరుస పోరాట యోధులకు బూస్టర్‌ డోసు ఈనెల 25 వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. అంతకుముందు సమీక్షలో జిల్లాలో ముందస్తుగా చేపట్టిన చర్యలను వివరించారు. మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట ఆసుపత్రుల్లో 170 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మెదక్‌ వంద పడకల ఆసుపత్రిని ప్రత్యేక కొవిడ్‌ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహమ్మారి బారిన పడి చనిపోయిన 328 కుటుంబాలకు త్వరలో పరిహారం ఇస్తామన్నారు అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో శైలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని