logo

వనదుర్గమ్మ చెంతన చోరీ

మెదక్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు గర్భగుడిలోకి ప్రవేశించి.. హుండీని ధ్వంసం చేసి రూ.80 వేలకు పైగా అపహరించాడు. స్థానిక పోలీసులు, ఆలయ ఈవో తెలిపిన వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు వనదుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో గర్భాలయం కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించాడు. అక్కడి హుండీ తాళాన్ని బద్దలు కొట్టి... భక్తులు

Updated : 21 Jan 2022 02:15 IST

గర్భగుడి హుండీ నుంచి రూ.80 వేలకు పైగా అపహరణ

తొలగించిన కిటికీ ఇలా..

మెదక్‌, పాపన్నపేట, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు గర్భగుడిలోకి ప్రవేశించి.. హుండీని ధ్వంసం చేసి రూ.80 వేలకు పైగా అపహరించాడు. స్థానిక పోలీసులు, ఆలయ ఈవో తెలిపిన వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు వనదుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో గర్భాలయం కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించాడు. అక్కడి హుండీ తాళాన్ని బద్దలు కొట్టి... భక్తులు సమర్పించిన కానుకలతో పాటు నగదు ఎత్తుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున అర్చకులు రోజు మాదిరిగానే ఆలయానికి వచ్చి పూజాకార్యక్రమాలు మొదలుపెట్టే క్రమంలో ధ్వంసమైన కిటికీ, దెబ్బతిన్న హుండీని గమనించి.. ఈవో శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అదనపు ఎస్పీ డా.బాలస్వామి, మెదక్‌ డీఎస్పీ సైదులు, మెదక్‌ టౌన్‌ సీఐ వెంకటయ్య, హవేలి ఘనపూర్‌, కొల్చారం ఎస్‌ఐలు సంతోష్‌కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. గర్భగుడిలో చోరీ జరిగిన తీరు సీసీ కెమెరాలో నమోదైంది.

సీసీ కెమెరాలో నిక్షిప్తమైన నిందితుడి చిత్రం

పలుమార్లు విఫలయత్నం..
ఆగంతుకుడు ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న ఇనుప గ్రిల్‌ తాళాన్ని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఎడమవైపు ఉన్న కిటికీని ధ్వంసం చేసేందుకు యత్నించినా సాధ్యపడకపోవడంతో కుడి వైపు కిటికీని విరగొట్టి.. గర్భాలయం లోకి ప్రవేశించాడు. అక్కడ హుండీ తాళాన్ని పగలగొట్టి కానుకలు, నగదును సంచిలో మూటకట్టుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న మరో హుండీ తాళాన్ని పగలగొట్టేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో అమ్మవారికి మొక్కుకుని అక్కడి నుంచి నిష్క్రమించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఎత్తుకెళ్లినట్లు ఈవో పేర్కొన్నారు. గతనెల 6న (66 రోజులకు) ఆలయ హుండీని లెక్కించగా రూ.35.82 లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కొల్లగొట్టిన హుండీ తెరవక బుధవారానికి 44 రోజులు. ఆదాయం కూడా భారీగా ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడు పట్టుబడితే కానీ ఏమాత్రం చోరీ అయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆలయ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

హుండీని పరిశీలిస్తున్న డీఎస్పీ సైదులు, మెదక్‌ టౌన్‌ సీఐ వెంకటయ్య, ఆలయ ఈవో శ్రీనివాస్‌


పోలీసులు ఏమయ్యారు..

డుపాయల పరిసరాల్లో కొద్దినెలల కిందట పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. నాగ్సాన్‌పల్లి నుంచి ఆలయానికి వచ్చే దారిలో ఆర్‌డబ్ల్ల్యూఎస్‌కు చెందిన గదుల్లో నిత్యం ఇద్దరు నుంచి ముగ్గురు బందోబస్తులో ఉంటున్నారు. ఆలయానికి 500 మీటర్లలో ఔట్‌పోస్టు ఉంది. విధుల్లో ఉన్న పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాల్సి ఉండగా ఏమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి ఆగంతకుడు దర్జాగా వచ్చి చోరీకి పాల్పడ్డాడు. ప్రధాన ఆలయం వద్ద రాత్రివేళ కాపలా ఉంటున్న శివయ్య బుధవారం రాత్రి అనారోగ్య కారణంతో రాజగోపురం వద్ద నిద్రించినట్లు పోలీసులకు వివరించాడు. ఈ విషయమై అదనపు ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ.. నిందితుడి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టామని. వీలైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.


మూడోసారి...

డుపాయల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. కొన్నేళ్ల కిందట ఆలయం ముందు భాగంలో రెండుసార్లు చోరీకి పాల్పడగా.. ప్రస్తుతం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి హుండీని ధ్వంసం చేసి నగదు, కానుకలు ఎత్తుకెళ్లాడు. ఆలయానికి ఆశించిన స్థాయిలో భద్రత లేదని ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదించినా ఫలితం లేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని