logo

కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అత్తింట కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చేగుంటలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌

Published : 21 Jan 2022 02:12 IST

చేగుంట, న్యూస్‌టుడే: అత్తింట కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చేగుంటలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌ పట్టణం నవాబుపేటకు చెందిన నేహా సుల్తానా (22)ను రెండేళ్ల కిందట చేగుంటకు చెందిన ఇబ్రహీంకు ఇచ్చి వివాహం చేశారు. రూ.లక్ష నగదు, తులన్నర బంగారం, ఇతర కానుకలు ఇచ్చారు. కట్నం చాలలేదని పెళ్లి అయిన రెండు మాసాల నుంచే భర్త ఇబ్రహీం, అత్త షేక్‌ ఖైరున్నీసా, మామ యూసుఫ్‌, మరిది అఖిల్‌, తోటికోడలు మస్రత్‌లు వేధించడం ప్రారంభించారు. దీంతో సుల్తానా బంధువులు పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తన తల్లి హైమదీ బేగంకు ఆమె ఫోన్‌చేసి వేధింపులు భరించలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేయగా సర్దుకుపొమ్మని సూచించింది. తర్వాత అరగంటకు సుల్తానా మామ యూసుఫ్‌ ఆమె తల్లికి ఫోన్‌ చేసి మీ కుమార్తె పడకగదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో ఆమె చేగుంటకు చేరుకుని ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తె మృతదేహాన్ని చూసిన కన్నీరు మున్నీరుగా విలపించింది. కట్నం వేధింపులు భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న హైమదీ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమెకు 14 నెలల కుమార్తె ఉండగా తల్లి మృతితో బేలచూపులు చూస్తున్న చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని