logo

పంట వ్యర్థం.. కాల్చితే అనర్థం

జిల్లాలో వానాకాలం పంట చేతికందగానే రైతులు వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఎలాంటి ఖర్చులేకుండా తదుపరి పంట వేసుకోవచ్చని, ఆ బూడిద తర్వాత పంటకి కాస్త ఎరువుగా

Published : 21 Jan 2022 02:12 IST

కుళ్లిస్తే  భూమి సారవంతం

తగులబెట్టిన తరువాత వరి పొలాలు

నారాయణఖేడ్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వానాకాలం పంట చేతికందగానే రైతులు వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఎలాంటి ఖర్చులేకుండా తదుపరి పంట వేసుకోవచ్చని, ఆ బూడిద తర్వాత పంటకి కాస్త ఎరువుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ ఇది వాతావరణంతో పాటు చేనుకు ఎంత ప్రమాదకరమో తెలుసుకోలేకపోతున్నారు. కాల్చి వేతతో కలిగే అనర్థాలు, వ్యర్థాల పునర్వినియోగంతో కలిగే ప్రయోజనాలపై ‘న్యూస్‌టుడే’ కథనం...

అని విధాలా చేటే...
దేశ జనాభాలో దాదాపు 85 శాతం ప్రజల ఆయు ప్రమాణం ఏడేళ్లు తగ్గడానికి వాయు కాలుష్యం కారణమవుతోందని చికాగో విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. టన్ను గడ్డి కాల్చడం వల్ల నేలలోని 12 కిలోల యూరియా, 41 కేజీల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 16 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, సల్ఫర్‌ వంటి పోషకాలు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పంట వేడితో సెం.మీ.లోతు వరకు పోషకాలకు నష్టం వాటిల్లుతోంది. పంట ఎదుగుదలకు దోహదం చేసే మిత్ర పురుగులు 50 శాతానికి పై నశిస్తాయి. ప్రమాదవశాత్తు రూ. లక్షల విలువ చేసే వ్యవసాయ పరికరాలతో పాటు ఇతర పంటలు దగ్ధమవుతున్నాయి. రైతులు సైతం మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.

యంత్రాలనే వాడారు
వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపుగా 60 శాతానికి మించి పంటను యంత్రాలతో నూర్పిడి పూర్తి చేశారు. ఇది సేకరణకు పనికి రాదని కాల్చేస్తున్నారు. మిగిలిన దాంట్లో 50 శాతం మంది మాత్రమే గడ్డిని భద్రపరుస్తారు. పెసర, మినుము వంట పంటలు కూడా పంట నూర్పిడి అనంతరం దహనం చేస్తున్నారు.

గతంలో రైతులు పంటలను నిదానంగా కోసేవారు. దీంతో 1 సెం.మీ. నుంచి 2 సెం.మీ.ల గడ్డి మాత్రమే నేలలో మిగిలేది. పశుగ్రాసం కూడా లభించేది. దున్నినా, తగలబెట్టినా తక్కువ కాలుష్యం జరిగేది. ఇటీవలి కాలంలో యంత్రాల సహాయంతో పంట కోతలు జరుగుతున్నాయి. వీటివల్ల నేలపై 6 సెం.మీ. నుంచి 10 సెం.మీ.ల గడ్డి మిగులుతుంది. ఇలాంటి వాటిని కాల్చటం వల్ల ఎక్కువ కాలుష్యం ఉత్పన్నమవుతోంది. పంట కాలుష్యం పూర్తి కావటం, రుతుపవనాలు మందగించటం ఒకేసారి జరగటం వల్ల కాలుష్యం వేగంగా వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో పంట కోసిన తర్వాత పంట మొక్కల అవశేషాలు మిగులుతాయి.  వ్యవసాయ క్షేత్రాల్లోనే దున్నటం వల్ల అవి నేలలో గల వివిధ రకాల సూక్ష్మజీవుల చర్యల వల్ల కుళ్లి నేలలోకి చేరటం వల్ల సారవంతమవుతుంది.


బహళ ప్రయోజనాలు: శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయాధికారి, మనూరు
పంటల వ్యర్థాలను పునఃవినియోగిస్తే ప్రయోజనాలుంటాయి. భూమిని సారవంతం చేసుకోవచ్చు. వాటినుంచి నత్రజని, భాస్వరం, పొటాష్‌లు పంటలకు అందించవచ్చు. విచక్షణ రహితంగా వస్తువులను గానీ, పంట పొలాల్లో మిగిలిన అవశేషాలను గానీ కాల్చ కూడదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని