logo

ఆగని ఆన్‌లైన్‌ మోసాలు..

సైబర్‌ మోసాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గ్రామీణ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. నేరగాళ్ల ఉచ్చులో పడి నగదు పోగొట్టుకుంటూనే ఉన్నారు. మండలంలోని లద్నూరుకు చెందిన కిరాణా దుకాణ యజమాని కూరెళ్ల

Published : 21 Jan 2022 02:12 IST

గంట వ్యవధిలో రూ.28 వేలు స్వాహా

మద్దూరు, న్యూస్‌టుడే: సైబర్‌ మోసాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా గ్రామీణ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. నేరగాళ్ల ఉచ్చులో పడి నగదు పోగొట్టుకుంటూనే ఉన్నారు. మండలంలోని లద్నూరుకు చెందిన కిరాణా దుకాణ యజమాని కూరెళ్ల బుచ్చిరాములు ఖాతాలో నుంచి గురువారం గంట వ్యవధిలో రూ.28,854 మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాలు.. గురువారం ఉదయం అతని సెల్‌ఫోన్‌కు 80167 27129 నెంబరు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన ఫోన్‌లోని ట్రూ కాలర్‌లో ‘ఫోన్‌ పే కస్టమర్‌ సర్వీస్‌’ అని రావడంతో నెలరోజుల క్రితం దుకాణంలో ఫోన్‌ పే స్కానర్‌ ఏర్పాటు చేసుకున్న బుచ్చిరాములు అందుకు సంబంధించిన ఫోన్‌ అయి ఉండొచ్చని భావించి ఫోన్‌ ఎత్తాడు. అవతలి వ్యక్తి హిందీలో సంభాషించడంతో అర్థం కాక అప్పుడే దుకాణానికి వచ్చిన యువకుడికి మాట్లాడమని ఫోన్‌ ఇచ్చి తన పనిలో నిమగ్నమయ్యాడు. హిందీలో మాట్లాడుతున్న అవతలి వ్యక్తి చెప్పినట్లు యువకుడు ఓటీపీ నెంబర్లు అగంతకుడికి చెప్పడం పూర్తయిన తర్వాత ఫోన్‌ వెనక్కి ఇచ్చాడు. ఏం జరిగిందని యువకుడిని ఆరా తీయగా అతను అడిగిన మేరకు మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లు చెప్పినట్లు వివరించాడు. దీంతో అనుమానం వచ్చిన దుకాణ యజమాని వచ్చిన నంబరుకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. సందేహించిన బుచ్చిరాములు ఫోన్‌ పే యాప్‌ ఖాతాను పరిశీలించగా ఐదు విడతల్లో రూ.28,854 లు మాయమైనట్లు గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం తర్వాత మరోసారి ఫోన్‌ చేసి నగదు జమ అయిందా అని ఆరా తీయగా కాలేదని చెప్పగా మళ్లీ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే మద్దూరు పోలీసులను ఆశ్రయించగా వారి సూచనల మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని