logo

బొట్టుబొట్టు మొక్కకు చేరేదెలా?

సూక్ష్మ సేద్య విధానంలో తŸక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు సాధ్యమవుతుంది. వృథాకు ఆస్కారం లేకుండా బొట్టుబొట్టూ మొక్కకు చేరుతుంది. అందుకే రైతులు ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తూ

Published : 21 Jan 2022 02:12 IST

పెరిగిన పరికరాల ధరలు
సూక్ష్మ సేద్య లక్ష్యాల సాధనకు ఆటంకం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

సూక్ష్మ సేద్య విధానంలో తŸక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు సాధ్యమవుతుంది. వృథాకు ఆస్కారం లేకుండా బొట్టుబొట్టూ మొక్కకు చేరుతుంది. అందుకే రైతులు ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సంవత్సరం నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారింది. సంబంధిత పరికరాల ధరలు పెరగడమే ఇందుకు కారణం.  

ఈ ప్రాంతాల్లో అధికం...
జిల్లాలో ఇప్పటికే 35,482 హెక్టార్లు సూక్ష్మ సేద్యం ద్వారా సాగవుతోంది. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌, కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలాల రైతులు ఈ పద్ధతిలో ఎక్కువగా పంటలు పండిస్తున్నారు. హత్నూర మండలం నుంచీ ఎక్కువ మంది అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో అరకొరగానే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.  

లక్ష్యం 807 హెక్టార్లు
2021-22 సంవత్సరంలో 807 హెక్టార్లను ఈ విధానంలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో బిందు సేద్యం ద్వారా 480 హెక్టార్లు కాగా 327 హెక్టార్లు తుంపర సేద్యానికి కేటాయించారు. విపణిలో సంబంధిత పరికరాల ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం తమకు చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడం లేదంటూ, వాటిని సరఫరా చేసే కంపెనీలు ముందుకు రావడంలేదు. ఇది లక్ష్యాల సాధనకు ప్రధాన అడ్డంకిగా మారింది. బిందు సేద్య లక్ష్యం 480 హెక్టార్లుండగా ఇప్పటివరకు 237, తుంపర .. లక్ష్యం 327 హెక్టార్లు కాగా  162 హెక్టార్లకు మాత్రమే పరికరాలను అందించేందుకు పలు కంపెనీలు ముందుకువచ్చాయి.

ఎన్నో ప్రయోజనాలు
ఈ సేద్యంతో ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవచ్చు. కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. పంటకు నీరు పెట్టేందుకు కూలీలను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ కాలంలోనైనా పంటలు పండించుకోవచ్చు. ఎరువులను ద్రావణం రూపంలో ప్రతి మొక్కకూ నీటితోపాటే అందించే వీలుంటుంది. తద్వారా ఎరువుల వృథాకూ అడ్డుకట్ట పడుతుంది.

జిల్లాలో సాగు ఇలా..
* బావులు, బోరుబావుల ద్వారా సాగులో ఉన్న విస్తీర్ణం: 70,348 హెక్టార్లు

సూక్ష్మసేద్యం
బిందు: 30,802 హెక్టార్లు
తుంపర: 4,680 హెక్టార్లు

రైతులతో కంపెనీల రహస్య ఒప్పందాలు?
హెక్టారు విస్తీర్ణంలో కూరగాయల సాగు చేయాలంటే సూక్ష్మ సేద్యానికి రూ.97వేల వరకు, చెరకు అయితే రూ.70వేల వరకు ఖర్చవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీలకు 90శాతం, ఇతరుల్లో 5 ఎకరాల్లోపు ఉన్న వారికి 90 శాతం, ఐదెకరాలపైన ఉన్న వారికి 80 శాతం రాయితీ ఇస్తున్నారు. సామగ్రి ధరలను ప్రభుత్వం పెంచకపోవడంతో కొంత మొత్తాన్ని రైతులే భరించేలా వారితో పలు కంపెనీలు అనధికారికంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధరల పెంపు దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉందని,  పెంచితే రైతులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తామంటూ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నట్లు తెలిసింది. డీడీ రూపంలో చెల్లించే మొత్తంతో పాటుగా ఎంతోకొంత భరించేందుకు ముందుకు వస్తున్న వారి పొలాల్లో యూనిట్ల గ్రౌండింగ్‌కు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం.


ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...
- సునీత, ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ జిల్లా అధికారి

సూక్ష్మసేద్య పరికరాల ధరలు పెరిగిన మాట వాస్తవమే. అందుకు అనుగుణంగా కంపెనీలకు ఇచ్చే ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ముందుకు వస్తున్నాయి. వాటి ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు