logo

వాషింగ్‌మిషన్‌లో వనదుర్గమ్మ సొత్తు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి సొత్తు ఎత్తుకెళ్లడంతో పోలీసులు కేసును సవాలుగా తీసుకున్నారు.

Published : 23 Jan 2022 02:59 IST

శీలంపల్లిలోని అత్తగారింట్లో  దాచిన చోరుడు
స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో నిందితుడు


పనిచేయని వాషింగ్‌ మిషన్‌ నుంచి నగదు సంచి తీస్తున్న పోలీసులు

న్యూస్‌టుడే, మెదక్‌, చిలప్‌చెడ్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి సొత్తు ఎత్తుకెళ్లడంతో పోలీసులు కేసును సవాలుగా తీసుకున్నారు. ఈ మేరకు మూడు బృందాలు రెండు రోజుల పాటు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు శనివారం మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లిలో చోరీకి గురైన సొత్తును పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.2.36 లక్షలతో పాటు పుస్తెలతాడు, వెండి, బంగారు నగలు, ఐదు కొత్త చరవాణులు లభ్యమయ్యాయి. దొంగతనం చేసింది కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డి అని.. అతడికి నేరచరిత్ర ఉందని పోలీసులు తేల్చారు. మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాలు.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈనెల 19 బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి ప్రవేశించి.. హుండీని ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన సంగతి విదితమే. దీనిపై కేసు నమోదవగా పోలీసులు దర్యాపు చేపట్టారు. వారికి లభించిన శాస్త్రీయ ఆధారాలు, ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా శనివారం ఉదయం 10 గంటలకు కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుడి అత్తగారి ఊరు చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లికి వెళ్లింది. గ్రామానికి చెందిన కొమ్మన్నగారి బాల్‌రెడ్డి ఇంటిని దిగ్బంధం చేసి తనిఖీలు చేపట్టగా.. ఐదు చరవాణులు, పుస్తెలతాడు లభించాయి.

నగదు లెక్కిస్తూ..

ఎవరికీ అనుమానం రాకుండా..

మళ్లీ ఇంటి పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఇంటి ఎదురుగా చెడిపోయి ఉన్న వాషింగ్‌ మిషన్‌ను ఉండగా.. దాన్ని తెరిచి చూశారు. అందులో నిందితుడు దాచిన ఓ సంచి లభించింది. చోరీ సొత్తును అందులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా నగదు, ఆభరణాలను భద్రపరిచాడు. డీఎస్పీ సైదులు సమక్షంలో నగదును లెక్కించగా రూ.2.36 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నగదుతో పాటు వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని తూకం వేయకపోవడంతో ఎన్ని గ్రాములన్న విషయం తెలియలేదు. నిందితుడి పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.


దొంగతనాలకు పాల్పడుతూ.. జల్సాగా తిరుగుతూ..

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డికి.. చిలప్‌చెడ్‌ మండలం శీలంపల్లికి చెందిన కొమ్మన్నగారి ప్రవీణతో అతనికి వివాహామైంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిందితుడి భార్య ప్రవీణకు పక్షవాతం రావడంతో ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటోందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు లక్ష్మారెడ్డికి నేరచరిత్ర ఉందని వారు తెలిపారు. గతంలో చాలా సార్లు చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. జల్సాలకు అలవాటుపడిన లక్ష్మారెడ్డి ఏడుపాయల గర్భాలయంలోనే చోరీకి పాల్పడటం గమనార్హం. దొంగతనానికి పాల్పడిన సమయంలో నీలిరంగు జీన్స్‌ ప్యాంటు ధరించిన అతను.. తర్వాత దాన్ని విడిచి మరో ప్యాంటు ధరించినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు ఆరేళ్ల తర్వాత శీలంపల్లికి వచ్చినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు వివరించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపారు. చిలప్‌చెడ్‌ ఎస్సై రమేశ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని