logo

జోరుగా గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ విస్తరణ

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు రైళ్లు నిలబడేలా పట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జనరేటర్లు రప్పించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవటంతో స్టేషన్‌ ఆవరణం

Published : 23 Jan 2022 04:57 IST

నాలుగు రైళ్లు నిలబడేలా ట్రాక్‌ల నిర్మాణం


కొనసాగుతున్న పనులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వేస్టేషన్‌ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు రైళ్లు నిలబడేలా పట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జనరేటర్లు రప్పించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవటంతో స్టేషన్‌ ఆవరణం దుమ్ముకొట్టుకుపోవటంతో అన్నింటినీ సరి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి పనులు చేయిస్తున్నారు. గూడ్స్‌ రైళ్లను నడిపేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌- కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈమేరకు మనోహరాబాద్‌ నుంచి వర్గల్‌ మండలం నాచారం, రాయపోల్‌ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్‌ పట్టణం వరకు మూడు స్టేషన్ల నిర్మాణంతోపాటు 31 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించారు. ఆరు చోట్ల ఫ్లైఓవర్లు, మరో మూడు చోట్ల అండర్‌ బ్రిడ్జీలు నిర్మించారు. 2020, జూన్‌ 18న రైల్వే భద్రతా కమిషన్‌ బృందం తనిఖీలు ముగిశాక అధికారులు కొబ్బరికాయ కొట్టి రైలు సేవలును లాంఛనంగా ప్రారంభించారు.

అధికారికంగా చేపట్టినా..

2020, ఆగస్టు 26న అధికారికంగా గజ్వేల్‌కు రైలు సేవలు ప్రారంభమైనట్లేనని అధికారులు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా సేవలు అందుబాటులోకి రాకపోవటంతో రైలు కల ఈప్రాంత వాసులకు సాకారం కాలేదు. ఈక్రమంలో విస్తరణ పనులు కొనసాగుతుండటంతో త్వరలోనే రైలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ (నాంపల్లి), సికింద్రాబాద్‌ స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వేశాఖ గజ్వేల్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో రింగు రోడ్డుకు చేరువలో గజ్వేల్‌ ఉండటంతో రాజధానిలోని రైల్వేస్టేషన్లకు ప్రత్యామ్నాయంగా ఇక్కడి స్టేషన్‌ను తీర్చిదిద్ది.. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచే రైళ్లను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్టేషన్‌లో ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన జనరేటర్లు


నాలుగు దశల్లో..

మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్ల మేర రూ.1160.47 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టును నాలుగు దశల్లో నిర్మిస్తున్నారు. తొలి దశలో  మనోహరాబాద్‌-గజ్వేల్‌ మధ్య 31 కిలోమీటర్లు రైలు నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మార్గం నిర్మాణానికి 2017, మార్చి 14న గజ్వేల్‌ మండలం గిరిపల్లి గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తయ్యాయి. రెండో దశ పనుల్లో భాగంగా గజ్వేల్‌- దుద్దెడ (33 కిమీ) మధ్య పట్టాల బిగింపు, వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. తొలుత రైలు సేవలను హైదరాబాద్‌ కాచిగూడ-గజ్వేల్‌ మధ్య అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని