logo

బడి బయట పిల్లలు.. చేరేలా!

బడి బయట పిల్లలను గుర్తించి ప్రవేశాలు (నమోదు) కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఈనెల 12 నుంచి మొదలైన సర్వే 25వ తేదీతో ముగియనుంది. ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ (ఓఓఎస్‌సీ) పేరిట నిర్వహించే ఈ కార్యక్రమం

Published : 23 Jan 2022 04:57 IST
జిల్లాలో ఓఓఎస్‌సీ కార్యక్రమం
ఈనెల 25తో ముగియనున్న సర్వే
చేర్యాల మండలం చిట్యాలలో సర్వే చేస్తున్న సీఆర్పీ

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌: బడి బయట పిల్లలను గుర్తించి ప్రవేశాలు (నమోదు) కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఈనెల 12 నుంచి మొదలైన సర్వే 25వ తేదీతో ముగియనుంది. ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ (ఓఓఎస్‌సీ) పేరిట నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా 6 - 14 ఏళ్లు, 15 - 19 ఏళ్ల వయసున్న వారిని గుర్తించి వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి పాఠశాల వైపు అడుగులు వేయించనున్నారు. అవసరం మేర ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు.

బాలల పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష నేతృత్వంలో ఓఓఎస్‌సీ సర్వే నిర్వహిస్తున్నారు. గత ఏడాది జనవరిలో సర్వే నిర్వహించగా.. బడీడు పిల్లలు 258 మందిని గుర్తించి.. చేర్పించారు. స్థాయిలను పెంపొందించేందుకు 11 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కేటాయించారు. గత ఏడాది నవంబరులో శిక్షణ మొదలు కాగా ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. నాలుగు నెలల వ్యవధిలో విద్యార్థులను పాఠశాల స్థాయికి చేరుకునేలా శిక్షణ అందిస్తారు. మరోవైపు ఏటా సర్వేలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర చోట్ల సీఆర్పీలు సమాచారం సేకరించి అనుగుణంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ సారి జిల్లాలో 104 మంది సీఆర్పీలు భాగస్వాములయ్యారు. పది రోజుల వ్యవధిలో పాఠశాలల్లో నమోదవని 92 మంది బాలబాలికలను గుర్తించారు. అందులో 6-14 ఏళ్ల వయసున్న వారు 89 మంది, 15-19 ఏళ్ల వారు ముగ్గురు ఉన్నారు.

రెండేళ్లుగా ఊసేలేదు..

జిల్లాలో ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌, ఇతర రాష్ట్రాల నుంచి ఏటా వందల సంఖ్యలో కార్మికులు.. కుటుంబ సభ్యులతో సహా తరలివస్తున్నారు. అక్టోబరు, నవంబరులో వలస వచ్చే వారంతా.. పిల్లలను బడికి పంపించడం లేదు. ఫలితంగా నిరక్షరాస్యులుగా మారుతున్నారు. వారిని సర్వేలో గుర్తిస్తున్నారు. పని ప్రదేశాల్లో యజమానుల సహకారంతో తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేసి విద్యా వాలంటీర్లను నియమించి తరగతులు జరిగేలా  చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సర్వే దోహదం చేయనుందని అధికారులు చెబుతున్నారు. 2019-20 వరకు వర్క్‌సైట్‌ పాఠశాలలు నడిచారు. అప్పట్లో పది పని ప్రాంతాల్లో పాఠశాలలు ఉండగా.. 200 మందికి విద్యాబుద్ధులు నేర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. దీంతో పలువురు బాలలు నిరక్షరాస్యతను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సర్వే ప్రక్రియ పకడ్బందీగా కొనసాగితే.. బాల కార్మికుల సంఖ్యను తగ్గించవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని