logo

ఔత్సాహిక క్రీడాకారులకు మంచి రోజులు

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించిన సర్కారు గజ్వేల్‌ వేదికగా ఏర్పాటు చేయదలిచిన క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందుకు ప్రభుత్వం

Published : 24 Jan 2022 01:05 IST

గజ్వేల్‌లో క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు

20 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌

కేటాయించిన భూమి..

గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించిన సర్కారు గజ్వేల్‌ వేదికగా ఏర్పాటు చేయదలిచిన క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందుకు ప్రభుత్వం గజ్వేల్‌లో 560/1 సర్వే నంబరులో 20 ఎకరాల స్థలం కేటాయించింది. రెండ్రోజుల కిందటే జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు భూమిని క్రీడా శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔత్సాహిక క్రీడాకారులకు ఇది ఎంతగానే ఉపయోగపడనుంది. ఇక్కడ క్రీడా గ్రామం అందుబాటులోకి వస్తే నియోజకవర్గ క్రీడాకారులతో పాటు జిల్లాలోని వారికి ఊతం ఇవ్వనుంది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 5 వేలమందికిపైగా వివిధ రంగాల క్రీడాకారులున్నారు. కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ తదితర ఆటల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. వారితో పాటు మిగిలిన ఔత్సాహిక క్రీడాకారులు సాధన చేసేందుకు జిల్లా కేంద్రంలో తప్పితే ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ఎలాంటి సదుపాయాలు లేక చాలా మంది హైదరాబాద్‌, సిద్దిపేటలోని మైదానాలకు వెళ్లి సాధన చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు కూడా మైదానం లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు, దేవాలయాల స్థలాల్లో నిర్వహిస్తున్నారు. రెండేళ్ల కిందట గజ్వేల్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో క్రీడా గ్రామం నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవటంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో మినీ స్టేడియం ఉన్నా పూర్తిస్థాయిలో క్రీడాకారులకు ఉపయోగపడక పోవడంతో తాత్కాలికంగా ఆర్టీఏ కార్యాలయానికి కేటాయించారు.

అందుబాటులోకి రానున్న సకల సౌకర్యాలు

క్రీడా గ్రామం నిర్మిస్తే సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌, పుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, రన్నింగ్‌ ట్రాక్‌, బాక్సింగ్‌ వేదికలు నిర్మించనున్నారు. వీటితోపాటు కళలు, ఇతర రంగాల్లో క్రీడాకారులకు సాధన చేయించే శిక్షకులను ప్రభుత్వం ఏర్పాటు నియమించనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు అతిథ్యం ఇచ్చేలా సౌకర్యాలు అందిరానున్నాయి. క్రీడల నిర్వహణతో గజ్వేల్‌ స్థాయి మరింత పెరగనుంది. నిరుడు ఆగస్టు నెలలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి గజ్వేల్‌ మినీ స్టేడియం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. త్వరలోనే అధునాతన సౌకర్యాలతో క్రీడా గ్రామం నిర్మిస్తామని ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని