logo

సవాలు స్వీకరించి.. సంకల్పంతో అడుగేసి..

అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహణ కష్టంతో కూడుకున్నదే.. ఓ సవాలు లాంటిదే.. అయినా ధైర్యంగా ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత అంటూ ముందుకొస్తోంది నేటి యువత. సదరు శాఖలో

Updated : 24 Jan 2022 04:08 IST

అటవీ సంరక్షణకు కదిలే..

60 మంది రేంజ్‌ అధికారులకు శిక్షణ

అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహణ కష్టంతో కూడుకున్నదే.. ఓ సవాలు లాంటిదే.. అయినా ధైర్యంగా ముందుకొచ్చి పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత అంటూ ముందుకొస్తోంది నేటి యువత. సదరు శాఖలో కొలువులు సాధించి అంతరించి పోతున్న అడవులను కాపాడేందుకు కంకణబద్ధులయ్యారు. వనాల సంరక్షణకు, రాత్రింబవళ్లు కష్టపడుతూ పచ్చని అడవులను కాపాడుతామని చెబుతున్నారు. శ్రమించి తాము నిర్దేశించుకున్న అటవీ క్షేత్రాధికారి (రేంజ్‌ ఆఫీసర్‌) ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. వీరికి వివిధ అంశాలపై 18 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా నర్సాపూర్‌ అడవుల్లో పర్యటించిన వీరిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. ఈ నేపథ్యంలో వారిపై స్ఫూర్తిదాయక కథనం.

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

మేడ్చల్‌ జిల్లా దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీ నుంచి శిక్షణ నిమిత్తం 60 మంది అటవీ క్షేత్రాధికారులు నర్సాపూర్‌కు వచ్చారు. వీరిలో జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, నాగాలాండ్‌, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరి వెంట డిప్యూటీ డైరెక్టర్‌ (డీఎఫ్‌వో) ఆంజనేయులు, కోర్సు డైరెక్టర్‌ వంశీకృష్ణ ఉండగా, ఇక్కడి అడవుల గురించి వివరించారు. అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన, అటవీ ఆధారిత ఉత్పత్తులు, వన్యప్రాణులు, అడవిపై ఆధారపడిన వారి ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టారు. సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి పనులను పరిశీలించారు.

17 మంది మహిళలు..

అటవీ క్షేత్రాధికారులుగా శిక్షణ పొందుతున్న 60 మందిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 మంది మహిళలు ఉన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరే ఉండటం గమనార్హం. కీలకమైన అటవీ క్షేత్రాధికారి స్థాయి పోస్టులను సైతం మహిళలు చేపట్టడం అటవీ శాఖలో సరికొత్త పరిణామమనే చెప్పాలి. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ ధైర్యంగా రాణిస్తామని చెబుతున్నారు. చెట్లను నరికే అక్రమార్కులకు శిక్ష పడేలా చేయడం, వన్యప్రాణుల సంరక్షణ, వేటగాళ్లు, స్మగ్లర్లను వేటాడటంలోనూ వెనుకాడమని అంటున్నారు.


వీఆర్వోగా పని చేసి..: సంతోష, సిద్దిపేట

నేను ఇంజినీరింగ్‌లో ఈసీఈ కోర్సు పూర్తిచేశా. చిన్నతనంలోనే ఏదైనా ప్రభుత్వ కొలువు దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. ఈ క్రమంలోనే మొదట్లో వీఆర్వో ఉద్యోగం రాగా, అందులో చేరాను. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామ వీఆర్వోగా విధుల్లో చేరా. ఆ తర్వాత అటవీ శాఖలో రేంజ్‌ అధికారుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. భర్త శ్రీనివాస్‌ సహకారంతో అన్ని విధాలుగా శ్రమించాను. చివరకు విజయం సాధించా. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, ఆక్రమణలు, స్మగ్లర్లు, అగ్నిప్రమాదాల నుంచి అడవుల్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తా. శిక్షణ ఎంతో బాగుంది.


భయపడేది లేదు: సరితా సిదార్‌, చత్తీస్‌గఢ్‌

మా తల్లిదండ్రులు నీరా సిదార్‌, కాళేశ్వర్‌ సిదార్‌. మా నాన్న అటవీ శాఖలో రేంజ్‌ అధికారిగా పని చేసి విరమణ పొందారు. ఆయన పని చేసిన శాఖలోనే నేను చేరడం ఎంతో సంతోషంగా ఉంది. అడవుల్లో రాత్రి పూట అక్రమంగా కలప నరికివేతలు, రవాణా, వన్యప్రాణులను వేటాడటం వంటివి తరుచూ జరుగుతుంటాయి. వీటిని ధైర్యంగా అడ్డుకుంటా. అక్రమార్కులకు, స్మగ్లర్లకు భయపడేది లేదు. అటవీ శాఖలో క్షేత్రస్థాయిలో రేంజ్‌ అధికారి పోస్టు అత్యంత కీలకమైనది. ఆధిపత్యమే కాదు ధైర్య సాహసాలనూ ప్రదర్శిస్తా. తల్లిదండ్రుల ప్రోత్సహంతో ముందడుగు వేస్తున్నా.


సంరక్షణకు అన్ని విధాలుగా..: కనిమోగి అరసు, తమిళనాడు

బీఎస్సీ (ఫారెస్టు) పూర్తిచేశా. మా అమ్మ సిబక్కియాం ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, నాన్న బియార్‌ అసన్‌ ఎల్‌ఐసీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ముందు నుంచి అటవీ శాఖలో ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీనికి తగ్గట్లుగా పట్టుదలతో శ్రమించి విజయం సాధించాను. శిక్షణలో భాగంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, జన్నారం తదితర ప్రాంతాల్లో పర్యటించాను. నర్సాపూర్‌లోనే దట్టమైన అడవులున్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను సంరక్షణకు కృషి చేస్తా. ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తాను.


నాన్నే స్ఫూర్తి..: అంకుష్‌ ఆనంద్‌, హిమాచల్‌ప్రదేశ్‌

మాది హిమాచల్‌ప్రదేశ్‌, అమీర్‌పూర్‌ జిల్లాలోని జహూ గ్రామం. నేను చదివింది మెకానికల్‌ ఇంజినీరింగ్‌. మా తండ్రి రవిచందర్‌ అటవీ శాఖలో రేంజ్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్ఫూర్తిగా ఇటు వైపు అడుగేశా. పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం దక్కించుకున్నా. మా నాన్న నిజాయతీగా పని చేస్తూ ఆదర్శంగా నిలిచారు. అటవీ సంరక్షణలో, వన్యప్రాణులను ప్రాణాలతో కాపాడటంలో, అడవి ఆధారిత ఉపాధిని ప్రోత్సహిస్తాను. స్వరాష్ట్రంలో దట్టమైన అడవులున్నాయి. ఇక్కడ చిట్టడవులే కనిపిస్తున్నాయి. శిక్షణలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నా.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని