logo

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

టీవీ రిమోట్‌ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్‌ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 24 Jan 2022 01:05 IST

టీవీ రిమోట్‌ విషయంలో దంపతుల మధ్య గొడవ

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: టీవీ రిమోట్‌ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్‌ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ(37) ఆదివారం మధ్యాహ్నం భర్త మల్లప్ప, ఇద్దరు కుమారులతో కలిసి ఇంట్లో టీవీ చూస్తుంది. ఆ సమయంలో టీవీ రిమోట్‌ గురించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ఆమెను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో తండ్రి, కుమారులు అంతా ఒక్కటే నేను ఒక్కదాన్ని వేరే అని చెప్ఫి. వంట చెరుకు కోసం పొలానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా... ఫలితం లేకుండా పోయింది.


గడ్డపోతారంలో మహారాష్ట్ర వాసి..

గడ్డపోతారం (జిన్నారం), న్యూస్‌టుడే: జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో పనిచేసే మహారాష్ట్రకు చెందిన కార్మికుడు రాహుత్‌(25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారం పోలీసులు, గడ్డపోతారం గ్రామస్థుల కథనం ప్రకారం... పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్న రాహుత్‌ 10 రోజులుగా విధులకు హాజరు కాకపోగా.. శనివారం మాత్రం పనులకు వెళ్లి తిరిగి గడ్డపోతారంలోని అద్దె ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో తిరిగాడు. అతడితోపాటు గదిలో ఉండే మరో స్నేహితుడు మొదటి షిఫ్టుకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.


లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు పులి సురేశ్‌(35) దుర్మరణం చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్కూర్‌కు చెందిన సురేశ్‌ కొంతకాలంగా హుస్నాబాద్‌లో నివాసం ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు. ఇందుకోసం రోజూ హుస్నాబాద్‌ నుంచి కట్కూర్‌కు వచ్చి వెళ్తాడు. ఆదివారం కట్కూర్‌ నుంచి హుస్నాబాద్‌కు వెళ్తున్నాడు. అంతకపేట వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే సురేశ్‌ మృతి చెందాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ కొత్తపల్లి రవిని వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు.

శివ్వంపేటలో..

జోగిపేట, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం పరిధిలోని శివ్వంపేట గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుర కార్మికుడు మృతిచెందినట్లు పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు.. చౌటకూరు మండలం సరాపల్లికి చెందిన ఎం.అర్జున్‌(35) సంగారెడ్డి పురపాలికలో పని చేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలోని శివ్వంపేట శివారులో డివైడర్‌ను ఢీకొనగా.. తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అర్జున్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని