logo

ఇక వాహనాలు రయ్‌రయ్‌

ఓ ప్రాంతం అభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో రహదారులు ప్రగతికి నిలువుటద్దం లాంటివి. అందుకే ప్రభుత్వాలు వీటి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో

Published : 24 Jan 2022 01:05 IST

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

పెద్దశంకరంపేట మీదుగా నిర్మించిన బైపాస్‌

ఓ ప్రాంతం అభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో రహదారులు ప్రగతికి నిలువుటద్దం లాంటివి. అందుకే ప్రభుత్వాలు వీటి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లే 161 జాతీయ రహదారి పనులు మెదక్‌ జిల్లా పరిధిలో ఇటీవల పూర్తయ్యాయి. సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా (ఎస్‌ఎన్‌ఏ) పేరిట నాలుగు వరుసలుగా విస్తరించిన ఈ మార్గం జిల్లాకు మరో మణిహారంలా మారింది. జిల్లాలో ఇప్పటికే 44, 765 (డి) జాతీయ రహదారులు ఉండగా ఇది మరింత హంగును తీసుకొచ్చింది. జిల్లా పరిధిలో 27 కి.మీ. మేర విస్తరించింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ వద్ద మొదలై పెద్దశంకరంపేట మండలం జంబికుంట వరకు ఉంటుంది.

2012లో జాతీయ రహదారిగా గుర్తింపు..

సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా మార్గాన్ని కేంద్రం 2012లో 161 జాతీయ రహదారిగా గుర్తించింది. భారత్‌ మాల ప్రాజెక్టులో చేర్చడంతో పాటు 2018-19లో బడ్జెట్‌లో నిధులు కేటాయించి విస్తరణకు శ్రీకారం చుట్టింది. తొలుత 140 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారి విస్తరణకు రూ.3,170 కోట్లు కేటాయించింది. కోల్‌కతాకు చెందిన సీఈ టెస్టింగ్‌ కన్సల్టెన్సీ సర్వే చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే పూర్తయిన ప్రాంతాల్లో భూములు సేకరించి 2013 భూసేకరణ చట్టాల ప్రకారం పరిహారం ఇచ్చారు. పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి కన్సల్టెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం కంది-రాంసాన్‌పల్లి మధ్యలో పనులు కొనసాగుతుండగా, మిగిలినవి పూర్తయ్యాయి.

విద్యుత్తు వెలుగులు ఇలా..

తొలగిన అడ్డంకులు..

రెండో ప్యాకేజీని కేఎన్‌ఆర్‌ నిర్మాణ సంస్థ చేపట్టి మూడేళ్లలో శరవేగంగా పూర్తి చేసింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ నుంచి పెద్దశంకరంపేట మండలం జంబికుంట వరకు మొత్తం 13 గ్రామాలు ఉండగా, పది చోట్ల దిగువ వంతెనలు నిర్మించి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేశారు. ముస్లాపూర్‌, బొడ్మట్‌పల్లి, కమలాపురం వద్ద మాత్రం వంతెనలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మిగిలిన చోట్ల మాత్రం వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం నాలుగు వరుసల దారిలో 90 కి.మీ. మేర హాయిగా ప్రయాణం సాగించడానికి అవకాశం ఏర్పడింది.

266.05 ఎకరాల భూమి సేకరణ..

పెద్దశంకరంపేటలో 100.17, అల్లాదుర్గం మండలంలో 144.08, టేక్మాల్‌ మండలంలో 21.8 ఎకరాల చొప్పున మొత్తం 266.05 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. పాత రోడ్డు వెంట ఉన్న 1,080 చెట్లను తొలగించారు. రహదారి మధ్య నుంచి అడ్డంగా 200 మీటర్లు విస్తరించేలా సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించేలా ఇప్పటికే హద్దుగా ప్రహరీని సైతం నిర్మించారు. ఇక మొత్తం 8 కొత్త బైపాస్‌లను సంగారెడ్డి, అందోల్‌-జోగిపేట, పెద్దశంకరంపేట, నిజాంపేట, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, మేనూరు, మద్నూర్‌ గ్రామాల వద్ద నిర్మించారు. జిల్లాలో పెద్దశంకరంపేట వద్ద బైపాస్‌ నిర్మించారు.

పెద్దశంకరంపేట నుంచి వెళ్లే రహదారి

రెండు ప్యాకేజీల పనులు పూర్తి

161 జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో రెండు ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. దీంతో ఆయా చోట్ల రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. పనులు పూర్తయిన ప్రాంతాల్లో త్వరలో టోల్‌ రుసుం వసూలుకు చర్యలు తీసుకుంటాం.

- మధుసూదన్‌రావు, పీడీ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని