logo

‘మెదక్‌-ఎల్కతుర్తి రహదారికి రూ.882.18 కోట్లు మంజూరు’

కేంద్రం మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి రూ.882.18 కోట్లు మంజూరు చేసిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌ గండి మైసమ్మ బాహ్యవలయ రహదారి నుంచి

Published : 25 Jan 2022 01:53 IST

మెదక్‌లో మొక్కలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, చంద్రపాల్‌, గంగాధర్‌, తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: కేంద్రం మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) నిర్మాణానికి రూ.882.18 కోట్లు మంజూరు చేసిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌ గండి మైసమ్మ బాహ్యవలయ రహదారి నుంచి మెదక్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిందని, మెదక్‌ నుంచి బైంసా వరకు మరో దఫా పనులు చేపట్టేందుకు డీపీఆర్‌ సిద్ధమైందని తెలిపారు. ఇటీవల సీఎంతో తాను దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి నిధుల విషయాన్ని ప్రస్తావించామన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్‌ నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ రహదారుల మరమ్మతులు, వర్షాలతో దెబ్బతిన్న దారుల బాగుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8.98 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, హరీశ్‌రావులకు ధన్యవాదాలు చెప్పారు. ఉపాధి పథకం ద్వారా నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8.70 కోట్లు కేటాయించారన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ మెదక్‌కు రానున్నారని, అప్పుడు మరిన్ని నిధుల మంజూరుకు కృషిచేస్తానన్నారు.

సుందరీకరణకు ప్రాధాన్యం
జిల్లా కేంద్రంలో సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద మెదక్‌-రామాయంపేట ప్రధాన రహదారి ఆనుకొని నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌కు సూచించారు. 39వ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర జట్టు క్రీడాకారిణి స్నేహను సత్కరించారు. పురపాలిక ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌ తండ్రి గట్టాగౌడ్‌ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఏఎంసీ ఛైర్మన్‌ జగపతి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, జయరాజ్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్‌, కృష్ణగౌడ్‌, ఉమర్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని