logo

గడువులోపుగగనమే!

జిల్లాలో సింగూరు, మంజీర ప్రాజెక్టులున్నా.. పట్టణాలకు తాగునీరు అందడం లేదు. జల వనరులు కళకళలాడుతున్నా.. ప్రజల దాహం తీర్చడం లేదు. గతంలో మిషన్‌ భగీరథ పథకం పనులు దక్కించుకున్న గుత్తేదారు సకాలంలో పూర్తి చేయలేదు. ఆ టెండరు రద్దు చేసి.. మరో గుత్తేదారుకు అప్పగించినా

Updated : 25 Jan 2022 05:42 IST

 మార్చి చివరి నాటికి తాగు నీరందించాలనేది లక్ష్యం
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ‘మిషన్‌ భగీరథ’ పనుల తీరిదీ..
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

సంగారెడ్డిలో అసంపూర్తిగా..

జిల్లాలో సింగూరు, మంజీర ప్రాజెక్టులున్నా.. పట్టణాలకు తాగునీరు అందడం లేదు. జల వనరులు కళకళలాడుతున్నా.. ప్రజల దాహం తీర్చడం లేదు. గతంలో మిషన్‌ భగీరథ పథకం పనులు దక్కించుకున్న గుత్తేదారు సకాలంలో పూర్తి చేయలేదు. ఆ టెండరు రద్దు చేసి.. మరో గుత్తేదారుకు అప్పగించినా.. పనులు నత్తనడకనే సాగుతున్నాయి. మరోసారి గడువు పెంచి.. మార్చి 31 వరకు అన్ని పట్టణాలకు తాగు నీటిని సరఫరా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల ప్రజలు నీటి ప్లాంట్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కథనం.

ఎక్కడెక్కడ.. ఎలా..
పుల్కల్‌ మండలం పెద్దారెడ్డిపేట, మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి పరీవాహకంలోని మంజీర నది నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని కుళాయిల ద్వారా సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, అమీన్‌పూర్‌, ఐడీఏ బొల్లారం, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌ పురపాలక సంఘాలున్నాయి. వీటి పరిధిలో నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట పురపాలికల్లో ఇప్పటికే ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. ఐడీఏ బొల్లారం, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌లో గోదావరి జలాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మిగిలిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌లో భగీరథ అసంపూర్తి పనుల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.  


కాలపరిమితిలోపు పూర్తి చేస్తాం..
- వీరప్రతాప్‌, ప్రజారోగ్యశాఖ ఈఈ, సంగారెడ్డి

సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట పురపాలికల పరిధిలో భగీరథ పనులకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటిలోపు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. గుత్తేదారును మార్చడం వల్ల గతంకంటే వేగంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని పురపాలికల పరిధిలో అదనంగా పనులు చేర్చడమూ జాప్యానికి కారణమే.  వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అంతర్గత పైపులైన్ల పనులు పూర్తి చేసి నల్లా కనెక్షన్లపై దృష్టి సారిస్తాం.


జాప్యానికి కారణాలు ఇవే..
జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం పనులను 2017లో ఆరంభించారు. అప్పట్లో నారాయణఖేడ్‌, జోగిపేటలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పూర్తి చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌లో ప్రజారోగ్యశాఖకు పనుల బాధ్యతను అప్పగించారు. ఆ శాఖ ఆధ్వర్యంలో ఏడాదిలోపు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినా.. ఆచరణలో అమలు కాలేదు. అప్పట్లో పనులు దక్కించుకున్న గుత్తేదారు మధ్యలోనే ఆపేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆయా గుత్తేదారు సంస్థను రద్దు చేసి.. మరో సంస్థకు పనుల బాధ్యతను అప్పగించారు. గత ఏడాది నవంబరు నాటికి పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. పోతిరెడ్డిపల్లి, కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లో కొంత భాగాన్ని సంగారెడ్డి పురపాలికలో విలీనం చేయడంతో.. అంచనాలను పెంచాల్సి వచ్చింది. నిర్దేశిత గడువును ఈ ఏడాది మార్చి చివరికి పెంచారు. ఇక్కడ వచ్చే వేసవి నాటికి ట్యాంకులు, సంపుల నిర్మాణాలు పూర్తి చేసి.. నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నా.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం గగనమేనని పలువురు పేర్కొంటున్నారు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని