logo

ఉత్తేజపరుస్తూ.. ఉత్సాహం నింపుతూ..

సాధించాలన్న తపన ఉంటే వయసుతో సంబంధం లేదు.. ఆసక్తి ఉండి శ్రమిస్తే తమదైన గెలుపు సాధ్యం.. ఇందుకు చక్కటి నిదర్శనం పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన నారాయణ. 50 ఏళ్ల వయసులోనూ పాటలు రాయడమే కాకుండా ఆలపిస్తు యువతలో ఉత్సాహం నింపుతున్నారు. దీనికితోడు యోగాసనాలు వేయడంలో దిట్ట.

Updated : 25 Jan 2022 05:39 IST

న్యూస్‌టుడే, తూప్రాన్‌, పాపన్నపేట

సాధించాలన్న తపన ఉంటే వయసుతో సంబంధం లేదు.. ఆసక్తి ఉండి శ్రమిస్తే తమదైన గెలుపు సాధ్యం.. ఇందుకు చక్కటి నిదర్శనం పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన నారాయణ. 50 ఏళ్ల వయసులోనూ పాటలు రాయడమే కాకుండా ఆలపిస్తు యువతలో ఉత్సాహం నింపుతున్నారు. దీనికితోడు యోగాసనాలు వేయడంలో దిట్ట.
పోడ్చన్‌పల్లికి చెందిన గంగయ్య, వెంకమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కొడుకు నారాయణ 10వ తరగతి చదివాడు. ఇతడికి భార్య రాజలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పది పూర్తయ్యాక నారాయణ 1990లో ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. అమ్మానాన్నలు నిరాకరించడంతో వెనుకడుగు వేశారు. వ్యవసాయం చేశారు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఏ పని చేస్తున్నా తనకిష్టమైన పాటలు రాయడం, పాడటాన్ని మాత్రం వదల్లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతలో చైతన్యం తీసుకొచ్చే పాటలెన్నో రాశారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఒప్పంద పద్ధతిలో సెక్యూరిటీగా విధుల్లో చేరారు. అక్కడే ఆయనలోని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఖాళీ సమయంలో పాటలు రాసి ఆలపించడంతో విద్యార్థులు, ఆచార్యులు ప్రోత్సహించారు. పల్లె ప్రకృతి, గ్రామాల్లో ప్రేమానురాగాలు, వ్యవసాయ కుటుంబాల పరిస్థితిపై రాస్తుంటారు.
* నారాయణకు చిన్నతనంలో యోగాపై ఏర్పడిన ఇష్టంతో ఆసనాలు వేయడం నేర్చుకున్నారు. మెలకువన్నీ ఔపోసన పట్టారు. ఎంతో కఠినమైన ఆసనాలను సులభంగా వేయగలరు. ఎంతోమంది ఈయన వద్ద శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారికి నేర్పించేందుకు ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు. త్వరలోనే శిక్షకుడిగా మారి పాటలు రాయడం, పాడటం, యోగాసనాలు వేయడంపై తర్ఫీదు ఇస్తా.. ఇందుకు అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఆచార్యులు, అధికారులు, తోటి వారు ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు నారాయణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని