logo

పర్యాటకం..అభివృద్ధికి మార్గం!

ప్రాంత విశిష్టత.. విశేషాలను.. ఆయా చోట్ల పర్యాటక రంగం ప్రగతి సాధించడం ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తద్వారా నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి చెందిన తీరు.. కళ్లకు సాక్షాత్కరిస్తుంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అనేక ప్రాజెక్టులు, ఆలయాలు, నిర్మాణాలు.. మన వైభవానికి చిహ్నాలుగా నిలిచాయి.

Published : 25 Jan 2022 02:13 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌, గజ్వేల్‌, మెదక్‌, సంగారెడ్డి అర్బన్‌, వికారాబాద్‌ టౌన్‌

ప్రాంత విశిష్టత.. విశేషాలను.. ఆయా చోట్ల పర్యాటక రంగం ప్రగతి సాధించడం ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తద్వారా నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి చెందిన తీరు.. కళ్లకు సాక్షాత్కరిస్తుంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అనేక ప్రాజెక్టులు, ఆలయాలు, నిర్మాణాలు.. మన వైభవానికి చిహ్నాలుగా నిలిచాయి. వాటిపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రానున్న బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యతగా నిధులు కేటాయించి అభివృద్ధికి చొరవ చూపితే పర్యాటకం పురోగమన బాటలో పయనిస్తుందన్న విషయాన్ని మరచిపోకూడదు. నేడు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయా వాటి పరిస్థితిపై ‘నూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


నిధులు కేటాయిస్తేనే సాధ్యం.

‘పోచారం’పై దృష్టి పెడితే..
మెదక్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వన్యప్రాణి అభయారణ్యం, ప్రాజెక్టు అభివృద్ధిపై చిత్తశుద్ధి కరవైంది. రెండు జిల్లాల వారు ఎవరూ చేయాలన్న విషయం తేల్చుకోలేక అలాగే వదిలేశారు. గతంలో ప్రాజెక్టులో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బోటింగ్‌ ఏర్పాటు చేయగా, కొన్ని నెలలకు నిలిపివేశారు. ప్రాజెక్టు మధ్యలో ఐలాండ్‌ తరహాలో అభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు శూన్యం. మెదక్‌ ఖిల్లా పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. ఆయా వాటిపై ఇదివరకే ప్రతిపాదనలు పంపామని, నిధులు వస్తే పనులు చేపడతామని పర్యాటక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌ తెలిపారు.


పర్యవేక్షిస్తేనే..
జిల్లా కేంద్రం సంగారెడ్డి పరిధిలోని కల్పగూర్‌ శివారులో మంజీరా ప్రాజెక్టు ఉండగా, ఇక్కడే మొసళ్ల పెంపకం కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడికి సెలవు రోజుల్లో భారీగా సందర్శకులు వస్తుంటారు. అయితే కనీస సౌకర్యాలు కరవై నానాపాట్లు పడాల్సి వస్తోంది. కనీసం కూర్చునేందుకు బల్లలు కూడా లేవు. పిచ్చిమొక్కల మధ్య అభయారణ్యం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తుంది. సంగారెడ్డి పట్టణంలో మహబూబ్‌ సాగర్‌ సుందరీకరణ ఏళ్లు గడిచినా మోక్షం దక్కకపోవడం గమనార్హం. ఇరువైపులా మొక్కలు నాటినా వాటి పర్యవేక్షణ లేక అవన్నీ కనుమరుగయ్యాయి. మినీ శిల్పారామంలో ఎనిమిదేళ్ల క్రితం రూ.5 కోట్లతో పనులు చేపట్టారు. కేవలం కల్యాణ మండపం వినియోగంలోకి వచ్చింది.


అడుగులు పడుతూ..
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లను బహుళార్థక ప్రాజెక్టులుగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకు కావాల్సిందల్లా నిధుల ఊతమే. ఇప్పటికే ఈ రెండు చోట్లకు వారాంతపు సెలవు రోజుల్లో వందలాది మంది వచ్చి ప్రకృతి అందాలు వీక్షిస్తున్నారు. రాజధానికి చేరువలో రాజీవ్‌ రహదారికి సమీపంలో ఉండటంతో ఇక్కడికి నిత్యం సందర్శకుల తాకిడి ఉంటోంది. సాగు, తాగు నీటి అవసరాలకు ఈ జలాశయాలను నిర్మించారు. నీలి విప్లవంలో భాగంగా మత్స్యకారులకు ఉపాధి చూపాలన్న సంకల్పంతో ఇప్పటికే కొండపోచమ్మ సాగర్‌లో చేప విత్తనాలను వదిలారు. ఇక్కడ ప్రాజెక్టు చూట్టూ సుమారు 17 కి.మీ. మేర తారు రోడ్డు వేశారు. మల్లన్న సాగర్‌ వద్ద కూడా రోడ్డు నిర్మించి పచ్చదనాన్ని పెంపొందిస్తే మరింత ఆకట్టుకోవడం ఖాయం. ఈ దిశగా ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. పార్కులు, హోటళ్లు, పిల్లలకు ఆట వస్తువులు తదితర ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.


వలయానికి దక్కాలి మోక్షం
మెతుకుసీమ జిల్లాలో అడుగుపెడితే నాలుగైదు పర్యాటక ప్రాంతాలను తిలకించే అవకాశం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రార్థనా మందిరం, మరోటి వనదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ నీటి సవ్వడులను తిలకించి మధురానుభూతిని పొందే ప్రాజెక్టులూ ఉన్నాయి. అయినా పర్యాటకం అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉన్నాయి. పర్యాటక వలయం ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. పాపన్నపేటలో ఏడుపాయల ఆలయం, మెదక్‌లో చర్చితో పాటు కాకతీయుల కాలంలో నిర్మించిన ఖిల్లా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక సమీపంలో పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులు ఉన్నాయి. కొల్చారంలో జైన మందిరం.. వీటన్నింటినీ తిలకించేందుకు హైదరాబాద్‌ నుంచి బస్సు బయల్దేరేలా పర్యాటక వలయం ఏర్పాటుకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. రెండేళ్ల కిందట మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులనూ ఆదేశించారు. ఈ దిశగా వేగంగా అడుగులు పడి నిధులు మంజూరై అభివృద్ధి చేస్తే పర్యాటక జిల్లాగా మారడం ఖాయం.


సిద్దిపేటలో వావ్‌ అనాల్సిందే..

జిల్లా కేంద్రం సిద్దిపేట దినదినాభివృద్ధి చెందుతోంది. పర్యాటకం అదే స్థాయిలో ప్రగతి వైపు పయనిస్తోంది. సిద్దిపేట కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) అందుకు ఉదాహరణ. నాడు.. అటు వైపు వెళ్లేందుకు ప్రజలు సాహసించే వారు కాదు. నేడు అటు వైపు వెళ్లని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పట్టణ వాసులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ఇరుగుపొరుగు జిల్లాలకు ఇదో టూరిజం స్పాట్‌గా మారింది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి చెందుతున్న తీరును చూస్తే î((¦వ్‌ అనాల్సిందే. సాధారణ రోజుల్లో 1500 మంది, సెలవు, పండుగ రోజుల్లో వేలాది మందితో చెరువు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేలాడే వంతెన, సాహస పార్కు, స్కై సైక్లింగ్‌, పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా బ్యాటరీ కారు, ఎలక్ట్రికల్‌ బగ్గీ, ఇతర వాహనాలు, రాక్‌ గార్డెన్‌, నెక్లెస్‌ మార్గం, బోటింగ్‌, ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఇటీవల గ్లోగార్డెన్‌, రూ.4.20 కోట్లు వెచ్చించి ఆక్వా స్క్రీన్‌ ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను ప్రారంభించారు. లఘు, స్వీయచిత్రాలు, వివాహానికి ముందు మధుర జ్ఞాపకంగా ఉండేలా తీసుకునే దృశ్య చిత్రీకరణకు అనువుగా ఈ ప్రాంతం ఉండటం విశేషం. హరితం, పచ్చిక భలేగా ఆకట్టుకుంటోంది. దీని స్ఫూర్తిగా నాలుగు జిల్లాల్లో అడుగులు పడితే పర్యాటకం పురోగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ప్రతిపాదనలు సిద్ధం చేసి..
పచ్చదనం, పక్షుల కిలకిలరావాలతో సందర్శకులను ఆకట్టుకునే వికారాబాద్‌ జిల్లాలోని అనంతగరి అభివృద్ధికి దూరం ఉంది. దశాబ్దకాలంగా పర్యాటక కేంద్రంగా మార్చి అన్ని వసతులు కల్పిస్తామన్న అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2019లో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో రూ.400 కోట్ల మేర ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అయితే ఆ తర్వాత దానికి మోక్షం దక్కలేదు. వారాంతపు సెలవు దినాల్లో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి అనంతగిరి ప్రకృతి అందాలను చూసేందుకు ఆసక్తిగా వస్తుంటారు. వీరికి కనీస సౌకర్యాలు కరవై ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా రానున్న బడ్జెటలో నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపి వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.


సౌకర్యాలు కల్పిస్తే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక,  మహారాష్ట్రల నుంచి నిత్యం తరలివచ్చే భక్తులతో సందడిగా ఉండే ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో బసకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం గమనార్హం. ఆ దిశగా ఇంతవరకు ఒక్క అడుగు పడలేదు. ఆలయం ముందు భాగం నుంచి వాలాద్రి వాగు వెళ్తుంది. దానికి ఇరువైపులా రక్షణ గోడ లేదు. ప్రత్యేక రోజుల్లో క్యూలైన్లు బిగించాల్సి ఉంది. కనీస వసతులు కూడా కరవయ్యాయి. వీటన్నింటికీ నిధులు మంజూరు కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని