logo

పాజిటివ్‌.. పారాహుషార్‌

జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. మూడవ దశలో వైరస్‌ వ్యాప్తి జరగడంతో పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లాలో అత్యధిక పాజిటివ్‌ శాతం ఉందని ఇటీవల వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. జిల్లాలో మొదటి, రెండో దశతో పోలిస్తే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి పెరిగింది. ఈనెలలో ఎక్కువగా నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి, తూప్రాన్‌ సామాజిక, పీహెచ్‌సీ, మెదక్‌ ప్రాంతీయ, పట్టణ ఆరోగ్య కేంద్రం...

Published : 27 Jan 2022 01:43 IST

రాష్ట్రంలోనే జిల్లా అత్యధిక శాతం నమోదు
న్యూస్‌టుడే, మెదక్‌

మెదక్‌లో వివరాలు సేకరిస్తున్న సర్వే బృందం


రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ 3.16 శాతం.
ఒక్క జిల్లాలోనూ పది శాతం మించలేదు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉంది.

- వైద్య ఆరోగ్య రాష్ట్ర సంచాలకులు డా.శ్రీనివాసరావు


జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. మూడవ దశలో వైరస్‌ వ్యాప్తి జరగడంతో పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లాలో అత్యధిక పాజిటివ్‌ శాతం ఉందని ఇటీవల వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. జిల్లాలో మొదటి, రెండో దశతో పోలిస్తే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి పెరిగింది. ఈనెలలో ఎక్కువగా నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రి, తూప్రాన్‌ సామాజిక, పీహెచ్‌సీ, మెదక్‌ ప్రాంతీయ, పట్టణ ఆరోగ్య కేంద్రం, రామాయంపేట సీహెచ్‌సీ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించిన వారికి పాజిటివ్‌ బయటపడుతోంది. ఈ ఆసుపత్రుల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇంటింటా ఆరా తీయడంతో..
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 21 నుంచి వైద్యఆరోగ్య సిబ్బంది సర్వే మొదలుపెట్టారు. జిల్లాలోని 469 పంచాయతీలతో పాటు నాలుగు పురపాలికల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలపై ఆరా తీసి అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ (ఔషధాలు) కిట్లను అందజేస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారిని వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పక్కాగా అమలయ్యేలా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో అధికారులు పర్యవేక్షణ చేయిస్తున్నారు. నిత్యం ఆరోగ్యస్థితిపై వారు ఆరా తీస్తున్నారు.

వడివడిగా టీకా..
జిల్లాలో టీకా పంపిణీ ప్రక్రియ వడివడిగా కొనసాగుతోంది. జిల్లాలో మొదటి విడత 6.12 లక్షల మందికి టీకా వేయగా, రెండో విడతలో 5.03 లక్షల మందికి పంపిణీ చేశారు. మొదటి విడతలో శతం శాతం పూర్తికాగా, రెండో విడతకు సంబంధించి 91.90 శాతం పూర్తయింది. గతేడాది సెప్టెంబరు 16 నుంచి ప్రత్యేక కార్యచరణ చేపట్టడంతో టీకా పంపిణీ సాగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రెండు ప్రాంతీయ, రెండు సామాజిక ఆసుపత్రులలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.మరోవైపు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు  ఏఎన్‌ఎంలు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి టీకా వేస్తున్నారు. 15-17 ఏళ్లలోపు ఉన్న 31,216 మందికి టీకా ఇవ్వగా, 5,108 మందికి ప్రికాషన్‌ డోసు అందజేశారు.


తగ్గుముఖం  పట్టే అవకాశం..
- వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో ఎక్కువ పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదు. పాజిటివ్‌ శాతం తగ్గాలంటే అధిక సంఖ్యలో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈనెలాఖరుకు వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండి, తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంటింటి సర్వే ద్వారా పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి కిట్‌ను అందజేస్తున్నాం. మరో రెండు రోజుల పాటు సర్వే ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని