logo

రూ.2 కోట్ల గంజాయి పట్టివేత

రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తున్న రూ.రెండు కోట్ల విలువైన వేయి కిలోల ఎండు గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోలీసులు పట్టుకున్నారు. సరకుతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు.

Published : 27 Jan 2022 01:43 IST

వివరాలు వెల్లడిస్తున్న సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌

సదాశివపేట, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తున్న రూ.రెండు కోట్ల విలువైన వేయి కిలోల ఎండు గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోలీసులు పట్టుకున్నారు. సరకుతో కూడిన లారీని స్వాధీనం చేసుకున్నారు. సదాశివపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ రమణకుమార్‌ విలేకర్ల  సమావేశంలో వెల్లడించిన వివరాలు.. సదాశివపేట మండలం నందికందిలో ఓ టీస్టాల్‌ వద్ద ఆగి ఉన్న లారీలో గంజాయి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం రావడంతో స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. అందులో ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లాకు చెందిన షేక్‌ సలీం, అజిత్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారని ఎస్పీ వివరించారు. నందికందిలో టీస్టాల్‌ వద్ద సలీం అలియాస్‌ ఆజాద్‌కు కొంత గంజాయిని విక్రయించేందుకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రూ.50వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందగా అక్కడికి చేరుకొని రూ.2 కోట్ల విలువైన వేయి కిలోల గంజాయి లారీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి అడ్వాన్సు ఇచ్చిన సలీం(ఆజాద్‌) పరారీలో ఉండగా.. మిగతా ఇద్దరు నిందితులు షేక్‌ సలీం, అజిత్‌ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్న సదాశివపేట సీఐ సంతోష్‌కుమార్‌, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సైలు అంబారియా, జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

స్వాధీనం చేసుకున్న సరకు

కోహీర్‌: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముంబయికి తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన 124 కిలోల ఎండు గంజాయిని కోహీర్‌ ఎస్సై రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పీచేర్యాగడి సమీపంలో పట్టుకున్నట్లు సంగారెడ్డి ఎస్పీ బుధవారం తెలిపారు. నాగల్‌గిద్ద మండలం కసరగుత్తి గ్రామం పాండురంగతండాకు చెందిన రాజు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జాన్‌పూర్‌కు చెందిన కమలేష్‌కుమార్‌, శివమూర్తిశర్మ, ముంబయి పట్టణం గాంధీనగర్‌ పోక్రాన్‌కు చెందిన సునీల్‌బాబాషిండేను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. జహీరాబాద్‌ డీఎస్పీ శంకరరాజు, సీఐ భరత్‌కుమార్‌, ఏఎస్సై సంగమేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని