logo

పరిశ్రమల చేయూత... ప్రగతికి భరోసా

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు ఆర్జిస్తున్న పరిశ్రమలకూ బాధ్యత ఉందని అనేక సేవా కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. పరిశ్రమలు సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులతో పాఠశాలలు, పల్లెల

Published : 27 Jan 2022 01:43 IST

సీఎస్‌ఆర్‌ నిధులతో మారుతున్న తీరు

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు ఆర్జిస్తున్న పరిశ్రమలకూ బాధ్యత ఉందని అనేక సేవా కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. పరిశ్రమలు సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) నిధులతో పాఠశాలలు, పల్లెల అవసరాలను తీరుస్తున్నారు. భవనాల నిర్మాణాలు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో సీఎస్‌ఆర్‌ నిధులు వరప్రసాదం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా అనేక సమస్యల పరిష్కారానికి చేయూత అవుతున్నాయి. ఉపాధి కల్పించటంతో పాటు నిధులు వెచ్చించి ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న అంశాలపై కథనం.


నీటి శుద్ధి కేంద్రాలు.. భవన నిర్మాణాలు

న్యూస్‌టుడే, జిన్నారం: జిన్నారం, గుమ్మడిదల, పటాన్‌చెరు మండలాల్లో దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కరించటానికి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులు తోడ్పడ్డాయి. హెటెరో, మైలాన్‌, విర్కో, అరబిందో, మెట్రోకెమ్‌, ఎస్‌ఎంఎస్‌, సరాకా లేబొరేటరీస్‌ నిధులు అందించాయి. జిన్నారంలో హెటెరో పరిశ్రమ రూ.3 కోట్లు వెచ్చించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు భవనాన్ని సమకూర్చింది. జిన్నారంలోనే రూ.60 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హెటెరో, మైలాన్‌ పరిశ్రమలు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాయి. పదేళ్లుగా ఉమ్మడి మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నోటు పుస్తకాలు, బ్యాగులు, ఏడాదికి సరిపోను స్టేషనరీ అందిస్తున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సైతం విద్యాభివృద్దికి వెచ్చిస్తుంది. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలో ఆదర్శ, జడ్పీ పాఠశాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, హైరిస్క్‌ కేంద్రానికి మైలాన్‌ పరిశ్రమ సొంత భవనాలు సమకూర్చింది. ప్రస్తుతం పురపాలిక సంఘ కార్యాలయం నిర్వహిస్తున్న కమ్యూనిటీ భవనం సైతం పీపీఎల్‌ పరిశ్రమ నిర్మించి ఇచ్చిందే. గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక గ్రామాల్లో అనేక విషయాల్లో యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. చివరికి పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, చెత్త దిబ్బలు వంటి ప్రభుత్వ పథకాల్లోనూ భాగస్వామ్యం ఉంటోంది.


బడి పిల్లలకు పెద్దపీట

సదాశివపేట: సదాశివపేటలోని పెన్నార్‌ పరిశ్రమ యాజమాన్యం దశాబ్దాల క్రితం అంకెనపల్లి గ్రామ శివారులో స్థాపించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. దుస్తులు, పాఠ్యపుస్తకాలు ప్రతి ఏటా అందిస్తున్నారు. వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి రోజు గుడ్లు, పాలు ఉచితంగా అందించారు. శుద్ధమైన నీరు సరఫరా చేశారు. చదువుల్లో రాణించిన విద్యార్థులకు ప్రతి ఏటా ఐదు వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ఎనిమిదేళ్లుగా అందించారు. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నర నుంచి నిలిపేశారు. మండలంలోని ఎవరెస్టు పరిశ్రమ యాజమాన్యం ఆరూర్‌, కోనాపూర్‌ గ్రామాల ప్రజలకు మినీ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేసి ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు.


ఆరోగ్యమే లక్ష్యం

మనోహరాబాద్‌: మెదక్‌ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌లో సీˆఎస్‌ఆర్‌ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఐటీసీˆ పరిశ్రమ కాళ్లకల్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.3 లక్షలతో... మోన్‌శాంటో ఉన్నత పాఠశాలలో వంటశాలలు నిర్మించారు. వీఎస్‌టీ వారు కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్‌ గ్రామాల్లో సుమారు కోటి రూపాయలతో ఇంటింటికీ శౌచాలయాలు నిర్మించారు. గ్రామాల్లో సౌర దీపాలు ఏర్పాటు చేశారు. ముప్పిరెడ్డిపల్లిలో శాంతాసనోఫీˆ కంపెనీ వారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్వెట్టర్లు, బ్యాగులు, రాతపుస్తకాలతో పాటు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి అందచేస్తున్నారు. రేడియంట్‌ నిర్వాహకులు ఇద్దరు విద్యావాలంటీర్లకు రూ.8 వేల చొప్పున ఆరేళ్ల నుంచి వేతనం చెల్లిస్తున్నారు. జీడిపల్లిలో నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. కొండాపూర్‌, ముప్పిరెడ్డిపల్లిలో వీఎస్‌టీ, శాంతాసనోఫీ కంపెనీల వారు వరుసగా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐటీసీˆ కంపెనీ పలు పాఠశాలల్లో శౌచాలయాలు నిర్మించింది. ముప్పిరెడ్డిపల్లిలో యూరోఫ్లెక్స్‌ వారు రూ.3 లక్షలతో అదనపు గది నిర్మించారు.


మహిళా సాధికారితకు కృషి

న్యూస్‌టుడే, జోగిపేట: మహిళా సాధికారితలో భాగంగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 2021లో పుల్కల్‌ మండలంలోని గొంగ్లూర్‌ గ్రామంలో ఐఆర్‌ఎస్‌ అధికారి (ప్రస్తుత డిప్యూటీ కమిషనర్‌ ఆప్‌ తెలంగాణ) సుధాకర్‌ నాయక్‌ చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ‘సర్వోదయ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కాటేజ్‌’ పేరుతో దానికి శంకుస్థాపన చేయించారు. సుమారు నెల క్రితం దాని నిర్మాణం పూర్తయి అందులో ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. సుధాకర్‌ నాయక్‌తో పాటు మరి కొంత మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు, వైద్యులు, గ్రామంలోని 126 మంది మహిళలను భాగస్వామ్యం చేశారు. మహిళలను భాగస్వామ్యులుగా చేరిస్తే వారికి కూడా ఇది నాది అన్న భావన కలగడంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి ఉత్సాహంగా పని చేస్తారన్న నమ్మకంతోనే వారికి ఈ అవకాశం కల్పించారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. వేతనాన్ని, లాభాలనూ పంచుతారు. భవిష్యత్తులో కంపెనీని విస్తరించి మొత్తం 126 మంది సభ్యులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్వాహకులు ఉన్నారు. ఈ కంపెనీలో గానుగతో పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బరి నూనెలు తయారవుతున్నాయి. చేతితో తయారు చేసే డిర్జెంట్ సబ్బులు, బట్టలుతికే పౌడర్‌, కంది, పెసర, శనగ, మినుప పప్పు పొట్లాలు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ సంగారెడ్డి విపణిలో అమ్మకాలు సాగిస్తున్నారు. నెల రోజుల్లోనే 200 లీటర్ల నూనె అమ్మకాలు సాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని