logo

వీధి వ్యాపారులకు.. సగం మందికే రుణాలు

కరోనా మహమ్మారి పరిస్థితులతో వ్యాపారులు చాలా వరకు నష్టపోయారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్‌ పథకం కింద గతేడాది అర్హులైన ఒక్కో వీధి వ్యాపారికి రూ.10 వేల చొప్పున రుణం అందించారు. వ్యాపారం మెరుగు పర్చుకునేందుకు అవకాశం

Published : 27 Jan 2022 01:43 IST

‘ఆత్మ నిర్బర్‌’ రెండో విడత కేటాయింపులు అరకొరే..
తిరిగి శతశాతం చెల్లించిన వారికే అవకాశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

సంగారెడ్డి పట్టణంలో రహదారి వెంట దుకాణాలు

రోనా మహమ్మారి పరిస్థితులతో వ్యాపారులు చాలా వరకు నష్టపోయారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్‌ పథకం కింద గతేడాది అర్హులైన ఒక్కో వీధి వ్యాపారికి రూ.10 వేల చొప్పున రుణం అందించారు. వ్యాపారం మెరుగు పర్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాదీ కొవిడ్‌ మూడో దశతో మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది రుణాలు తీసుకొని వంద శాతం చెల్లించిన వారికి రెండో విడత రుణాలు ఇచ్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గతేడాది జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులు ముందుకు రాకపోవడంతో అన్ని పురపాలికల్లోనూ కొద్ది సంఖ్యలోనే రుణాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

1,443 మంది అర్హులుగా గుర్తింపు: జిల్లాలో 8 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో రెండో విడత రుణాలకు 1,443 మంది వీధి వ్యాపారులను అర్హులుగా గుర్తించారు. వీరంతా గతేడాది రుణం తీసుకొని వంద శాతం వాయిదాలను తిరిగి చెల్లించిన వారు. గతేడాది జిల్లాలో మార్చి నుంచి మొదలైన కరోనా వ్యాప్తితో వ్యాపారుల క్రయ విక్రయాలకు విఘాతం కలిగింది. రెండో దశలో ఏప్రిల్‌, మే నెలల్లో కేసులు వేలల్లో ఉండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ప్రస్తుతం మూడో దశలో కేసులు పెరుగుతున్నాయి. మొదటి సారి రుణం తీసుకొని.. ప్రతి నెలా వాయిదాలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లించిన వారికే ఆత్మ నిర్బర్‌ రెండో విడత రుణాలను బ్యాంకర్ల సహాయంతో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఈ ప్రక్రియను గతేడాది జూన్‌ నెలలోనే ప్రారంభించారు. అన్ని పురపాలికల పరిధిలోని అర్హులకు రూ.2.88 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా.. అమలులో మాత్రం వెనుకబడే ఉన్నారు. జిల్లాలో ఒక్క సంగారెడ్డిలో మినహా మిగిలిన పట్టణాల్లో పదుల సంఖ్యలోనూ వీధి వ్యాపారులు లబ్ధి పొందలేదు. బ్యాంకు అధికారుల నిబంధనలు ఇబ్బందిగా మారాయని కొందరు చిరు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడు నెలల్లో 713 మందికి రుణాలు మంజూరు కాగా.. 472 మందికి మాత్రమే పంపిణీ చేశారు. బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది కరోనా బారిన పడటంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

అధికారులు సమీక్ష నిర్వహించినా..
గతేడాది లాక్‌డౌన్‌ తరువాత వీధి వ్యాపారులకు ఆత్మనిర్బర్‌ కింద రూ.10 వేల చొప్పున రుణంతో ప్రభుత్వం ఆదుకుంది. మొదటి సారి రెగ్యులర్‌గా రుణాలు చెల్లించిన వ్యాపారులు మరోసారి కరోనాతో నష్టపోవడంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారికి రూ.20 వేల చొప్పున రెండో విడత రుణం అందించాలని ఆదేశించింది. రెండో విడత రుణాల మంజూరు అలస్యం అవుతుండటంతో ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రుణాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తరచూ బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించినా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు.


ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తాం..
- మల్లీశ్వరి, మెప్మా డీఎంసీ

మొదటి విడత రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడతలోనూ అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన వీధి వ్యాపారుల జాబితాను సిద్ధం చేసి బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించాం. వీరికి రుణాలు ఇచ్చే పక్రియను ప్రారంభించాం. రుణ గడువు ముగిసిన వెంటనే రెండో విడత రుణాలు ఇప్పిస్తాం. అర్హులందరికీ రూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని