logo

అవకాశాలు కల్పిస్తే.. అద్భుతాలు సాధిస్తారు!

ఆడపిల్ల పుడితే.. అదృష్టంగా భావించాలని, ప్రస్తుత ప్రపంచంలో వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసరావు అన్నారు. హరిదాస్‌పూర్‌ స్ఫూర్తి జిల్లాలోని ఇతర పల్లెలకు

Published : 27 Jan 2022 01:43 IST

ఆడపిల్లలను గౌరవించడంలో హరిదాస్‌పూర్‌ ఆదర్శం
గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసరావు

ఖాతా పుస్తకాలను చూపుతున్న చిన్నారులతో అతిథులు

ఈనాడు, సంగారెడ్డి: ఆడపిల్ల పుడితే.. అదృష్టంగా భావించాలని, ప్రస్తుత ప్రపంచంలో వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసరావు అన్నారు. హరిదాస్‌పూర్‌ స్ఫూర్తి జిల్లాలోని ఇతర పల్లెలకు ఆదర్శమని, ఒక్కొక్కటిగా మిగతా గ్రామాల ప్రజలూ దీనిని అందిపుచ్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొండాపూర్‌ మండలం శివన్నగూడెంలో బుధవారం 37 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకపై ఈ గ్రామంలో ఆడపిల్ల పుడితే సంబరం చేయనున్నారు. వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ అయిదు మొక్కలు నాటనున్నారు. త్వరలోనే  పొరుగున ఉన్న దొబ్బకుంటలోనూ ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వారి వివరాలను సేకరించారు. ఒకే రోజు వారందరికీ పాసుపుస్తకాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. శివన్నగూడెంలో 37 మంది ఆడపిల్లలకు తొలి నాలుగు నెలలకు సంబంధించిన నగదును అందించిన గోపాల్‌రెడ్డిని ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఏపీవో ప్రవీణ్‌కుమార్‌, ఖేడ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కళింగ క్రిష్ణకుమార్‌, శివన్నగూడెం సర్పంచి నేనావత్‌ హన్మమ్మ, కార్యదర్శి దినేష్‌, హరిదాస్‌పూర్‌ సర్పంచ్‌ షఫీ, కార్యదర్శి రోహిత్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.


రూ.5వేలు ఇస్తానని ప్రకటిస్తున్నా
లక్డారం గోపాల్‌రెడ్డి, పాశమైలారం

ఆడపిల్లలను గౌరవించుకునేలా హరిదాస్‌పూర్‌ గ్రామస్థులు చేస్తున్న కార్యక్రమాలను చూసి మేమూ ముందుకొచ్చాం. మా ఊరైన పాశమైలారంలోనూ ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా రూ.5వేలు అందించాలని నిర్ణయించుకున్నా. అమ్మాయిలు ఎందులోనూ అబ్బాయిలకంటే తక్కువ కాదు. వారూ ఉన్నతంగా ఎదిగేలా సమాన అవకాశాలు కల్పించాలి. ఈ సందేశాన్ని ప్రతి పల్లెకూ చేర్చేందుకు సహకారమందిస్తాం.


పండగ చేస్తాం.. చదువుకునేలా చూస్తాం
- వినోద్‌, యువకుడు, శివన్నగూడెం

మా పొరుగున ఉన్న హరిదాస్‌పూర్‌వాసుల మాదిరిగానే మా ఊర్లోనూ ఆడపిల్ల పుడితే ఆత్మీయ స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే  37 మందిని సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేర్చాం. దీంతో పాటు గ్రామాన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. యువకులమంతా కలిసి స్వచ్ఛ శివన్నగూడెంగా మార్చుకుంటాం. ముఖ్యంగా బాలికలు అందరూ మంచిగా చదువుకునేలా చూస్తాం. అందుకు తగిన వాతావరణాన్ని గ్రామంలో నెలకొల్పుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని