logo

సర్వే బాట.. సేవల మాట.!

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలే ధ్యేయంగా వారితో మమేకమవుతున్నారు. ఇప్పటికే ప్రతి గురువారం బస్‌ డే నిర్వహిస్తున్న డిపో అధికారులు.. ఏదో ఒక మార్గంలో బస్సుల్లో

Published : 27 Jan 2022 01:43 IST

ప్రయాణికులతో ఆర్టీసీ అధికారుల మమేకం
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

ఆర్టీసీ బలోపేతమే లక్ష్యంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలే ధ్యేయంగా వారితో మమేకమవుతున్నారు. ఇప్పటికే ప్రతి గురువారం బస్‌ డే నిర్వహిస్తున్న డిపో అధికారులు.. ఏదో ఒక మార్గంలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో సమస్యలపై ఆరా తీస్తున్నారు. తాజాగా పింఛను లబ్ధిదారుల ప్రయాణ అవసరాలపై సర్వే చేపట్టారు. మొత్తం 14 ప్రశ్నలతో కూడిన ఫారాన్ని నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఇటీవల (ఈ నెల 25వ తేదీ నుంచి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిపోల పరిధిలో మండలాల వారీగా అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమవుతున్నారు.

జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 284 బస్సుల ద్వారా సేవలు అందుతున్నాయి. కొవిడ్‌ పరిస్థితులు మినహాయిస్తే సాధారణ రోజుల్లో నిత్యం సుమారు రూ.32 లక్షల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 118 మార్గాల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులను ప్రగతిరథ చక్రాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతుంటారు. రోజువారీగా 1.02 లక్షల కి.మీ. మేర సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యాసంస్థలు తెరిచి ఉన్న క్రమంలో ప్రాంగణాలు, పట్టణాలు కళకళలాడుతుంటాయి. తరువాత పండుగల వేళ రద్దీ విపరీతంగా ఉంటుంది. రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒడుదొడుకుల నడుమ నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ తరుణంలో సంస్థ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏడు కేటగిరీల్లో పింఛనుదారులు..

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత సహా ఏడు కేటగిరీల్లో పింఛనుదారులను సర్వే ద్వారా పలకరిస్తున్నారు. వారితో పాటు అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాలో సంబంధిత జాబితాలను ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకున్నారు. గ్రామాల వారీగా నమూనాగా కొంత మందితో సర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమం దాదాపు వారం పాటు కొనసాగించనున్నారు. ప్రయాణ అవసరాలే లక్ష్యంగా వివరాల సేకరణ సాగుతోంది. లబ్ధిదారుని పూర్తి వివరాలు పూరించడంతో పాటు ప్రయాణ అవసరాలు, తరచూ ఎక్కడి నుంచి ఎటు వైపు వెళ్తున్నారు, అందుబాటులో ఉన్న ఇతర వాహనాలు, ఆర్టీసీ బస్సు సదుపాయం ఉందా.. లేదా.. రాయితీ కార్డు ఇస్తే సద్వినియోగం చేసుకుంటారా..? అంటూ ఆరా తీస్తున్నారు. తద్వారా రానున్న రోజుల్లో బస్సు సదుపాయం మెరుగుపర్చడంతో వారికి అనుకూలంగా ప్రత్యేక సదుపాయాలు, రాయితీ కల్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే బస్సుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులపై ప్రచార ప్రకటనలు తొలగించారు. రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌లో రవాణా చెల్లింపులపై మరింత శ్రద్ధ కనబర్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

పండగ తరువాత ప్రభావం..
కరోనా మూడో దశ.. ఆర్టీసీపై విరుచుకుపడుతోంది. సంక్రాంతి పండుగ తరువాత ప్రభావం పెరుగుతోంది. గత ఏడాది రెండో దశ అనంతరం సెప్టెంబరు నుంచి ఆదాయం పెరిగింది. నిత్యం దాదాపు రూ.32 లక్షల ఆదాయం వస్తుండగా.. ప్రస్తుతం ఆ మొత్తం రూ.25 లక్షలకు చేరడం గమనార్హం. ఈ లెక్కన రోజులో రూ.7 లక్షల వరకు ఆదాయం కోల్పోయినట్లయింది. విద్యార్థులకు సెలవులు పొడిగించడం, కరోనా తీవ్రత కారణంగా ఎక్కువ శాతం బస్సులో ప్రయాణించకపోవడం, ఇతరత్రా కారణాలతో ఆర్టీసీ మరోసారి ఆదరణ కోల్పోతుంది. సర్వే విషయమై ‘న్యూస్‌టుడే’ సిద్దిపేట డిపో మేనేజర్‌ రామ్మోహన్‌రెడ్డిని సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపట్టామన్నారు. ఈమేరకు నివేదికను పంపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని