logo

Telangana News: గుడిలో పరిచయం.. నిశ్చితార్థం దాకా తీసుకెళ్లి..

గుడిలో యువతిని యువకుడు పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. చెట్టపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, నిశ్చితార్థం దాకా మోసపూరితంగా తీసుకెళ్లాడు.

Updated : 04 Apr 2022 11:07 IST

న్యాయం చేయాలని బాధితురాలి ఆందోళన

అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: గుడిలో యువతిని యువకుడు పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. చెట్టపట్టాలేసుకొని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, నిశ్చితార్థం దాకా మోసపూరితంగా తీసుకెళ్లాడు. ముహూర్తాల సమయం వచ్చిందని పెళ్లి చేసుకోవాలని అడుగగా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నాడు యువకుడు. ఈ నేపథ్యంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో జరిగింది. ఎస్‌ఐ రవి, బాధితురాలు తెలిపిన వివరాలు.. గోవర్ధనగిరికి చెందిన బత్తుల సతీశ్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన ఓ యువతిని తొమ్మిదేళ్ల క్రితం పరిచయం చేసుకున్నాడు. కారు, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సతీశ్‌.. యువతిని ప్రేమ పేరుతో రోజూ ఫోన్లో మాట్లాడుతూ.. తరచూ కలుసుకుంటూ.. పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి నమ్మించాడు. పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో పలుసార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. వారి వద్ద పెళ్లికి అంగీకరించడంతో రుద్రంగిలోని లక్ష్మీనర్సింహస్వామి గుడిలో నిశ్చితార్థం జరిగింది. కట్నం కింద కారు, కొంత డబ్బు ఇస్తామని యువతి తల్లిదండ్రులు అతడి డిమాండుకు అంగీకరించారు. ముహూర్తాలు చూసి ప్రస్తుతం పెళ్లి పెట్టుకుందామని అడుగుతుండగా ఆమె తనకు ఇష్టం లేదని.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. అన్నివిధాలా మోసపోయానని గ్రహించిన యువతి ఆదివారం గోవర్ధనగిరికి వచ్చి అతని ఇంటిముందు బైఠాయించింది. సతీశ్‌ ఇల్లొదిలి పారిపోయాడు. పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, యువకుడిని స్టేషన్‌కు పిలిపించి పెళ్లి చేసుకునేందుకు కౌన్సిలింగ్‌ ఇస్తామని ఎస్‌ఐ అన్నారు. వినకపోతే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని