logo

వనదుర్గమ్మా.. వసతులు లేవమ్మా..!

దేశంలోనే రెండో వనదుర్గమ్మ ఆలయం.. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతమైన ఏడుపాయలలో వసతులు కొరవడటంతో భక్తజనానికి అగచాట్లు తప్పడం లేదు. పుణ్యక్షేత్రం చెంతన పలు అభివృధ్ధి పనులు

Published : 20 May 2022 01:15 IST

ఏడుపాయల్లో అసంపూర్తిగా అభివృద్ధి పనులు

దేశంలోనే రెండో వనదుర్గమ్మ ఆలయం.. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతమైన ఏడుపాయలలో వసతులు కొరవడటంతో భక్తజనానికి అగచాట్లు తప్పడం లేదు. పుణ్యక్షేత్రం చెంతన పలు అభివృధ్ధి పనులు చేపట్టినప్పటికీ అవి ముందుకు సాగడం లేదు. నిధుల కొరతతోపాటు అధికారులు దృష్టి సారించకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏటా నిర్వహించే జాతరకు 5 లక్షల పైచిలుకు, మాఘ అమావాస్యకు లక్షకు పైగా, ప్రతి ఆదివారం జిల్లా వాసులతో పాటు జంటనగరాలు, పొరుగు రాష్ట్రల నుంచి వేలాదిగా భక్తులు వస్తుంటారు. మంగళవారం, శుక్రవారంల్లోనూ రద్దీ ఉంటుంది. తగిన సదుపాయాలు లేకపోవడంతో భక్తులు, పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏటా సుమారు రూ.4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఆదాయం ఉన్నా.. అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు వాపోతున్నారు.


ప్రారంభానికి నోచుకోని యాగశాల..

ఆలయం ఎదుట యజ్ఞయాగాలు చేసేందుకుగాను రెండేళ్ల క్రితం రూ.42 లక్షలతో యాగశాల నిర్మించినా ప్రారంభానికి నోచుకోలేదు. మొక్కు చెల్లింపులో భాగంగా కేశ ఖండనం చేసుకోవడానికి ఆలయం వద్ద తగిన సౌకర్యాలు లేవు. దీంతో భక్తులు చెట్ల కిందనే చేయించుకోవాల్సి వస్తుంది. మాఘ అమవాస్య, మహాశివరాత్రి సమయాల్లో మాత్రమే ఆలయం వద్ద టెంట్లు వేసి ఏర్పాట్లు చేస్తారు. ఓ దాత సాయంతో నిర్మిస్తున్న కలా్యాణకట్ట మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉంది.


కన్వెన్షన్‌ కేంద్రం..

ఏడుపాయల్లో వివిధ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా అన్ని హంగులతో కన్వెన్షన్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈమేరకు రూ.కోటితో రెండు అంతస్తుల్లో నిర్మించాలని... 2020లో పనులు ప్రారంభించారు. నిధులు కొరత కారణంగా అసంపూర్తిగా మిగిలి ఉంది. విద్యుత్తు వ్యవస్థ, రంగులు, తదితర పనులు చేపట్టాల్సి ఉంది.


కొలిక్కిరాని ప్రయాణ ప్రాంగణం

నాలుగేళ్ల కిందట పాపన్నపేట మండలం జాతీయ రూర్బన్‌ పథకం కింద ఎంపికైంది. పథకం కింద కేటాయించిన నిధుల్లో రూ.25 లక్షలు బస్టాండ్‌ నిర్మాణానికి వ్యయం చేయాలని నిర్ణయించారు. దీంతో 2019లో ఏడుపాయల-పోతంశెట్టిపల్లి మార్గం పక్కన ప్రయాణ ప్రాంగణం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ స్లాబు దశలోనే ఉండటం గమనార్హం. దీంతో బస్సుల్లో వచ్చే భక్తులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది.


పునాది దశ దాటని శౌచాలయం

భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడుపాయల ప్రధాన చౌరస్తా వద్ద రూ.30 లక్షలతో గతేడాది శౌచాలయం నిర్మాణం చేపట్టారు. మొదట్లో పనులు చురుగ్గా సాగాయి. తరువాత పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. దీంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.


అందుబాటులోకి తీసుకొస్తాం..

ఏడుపాయల్లో రూర్బన్‌ నిధులతో చేపట్టిన పనుల్లో కొన్ని పూర్తి చేయాల్సి ఉంది. నిధులు కొరతతో జాప్యం జరుగుతోంది. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక దృష్టి సారించి.. భక్తులకు అందుబాటులోకి తెస్తాం

-గోపాల్‌, ఏఈ, పాపన్నపేట

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం...

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాగశాల నిర్మించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ప్రారంభిస్తాం. దాతతో మాట్లాడి కల్యాణకట్ట పనులు త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. భక్తులు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

- సార శ్రీనివాస్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి


రూ.6 లక్షలతో చేపట్టిన పాదరక్షలు భద్రపర్చే గది నిర్మాణం పూర్తికాక

పోవడంతో భక్తులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి.

- న్యూస్‌టుడే, పాపన్నపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు