logo

పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలుద్దాం

వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభయ్యే పట్టణ ప్రగతిని సమష్టిగా విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలు

Published : 20 May 2022 01:15 IST

ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు

పద్మా దేవేందర్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ

ఫారూఖ్‌ హుస్సేన్‌, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభయ్యే పట్టణ ప్రగతిని సమష్టిగా విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలు అగ్రభాగాన నిలవాలని సూచించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపాలిటీల ఛైర్మన్లు, కమిషనర్లతో హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో రాష్ట్రంలోని గ్రామాలు కొత్త రూపును సంతరించుకున్నాయని, మున్సిపాల్టీలు మాత్రం బాగుపడలేదన్నారు. ఈ దఫా స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. వైకుంఠధామాలు, కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టాలని, నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చాలని, మురుగు కాల్వలు శుభ్రం చేయాలన్నారు. చెత్త సేకరణలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐదుసార్లు జాతీయస్థాయి పురస్కారాన్ని దక్కించుకుందని, ఉమ్మడి జిల్లా నుంచి సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత పర్యటనకు ప్రభుత్వం పంపించే ఏర్పాట్లు చేయనుందన్నారు మున్సిపాలిటీల్లోనూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు యువతతో కమిటీలు నిర్మించాలని, అవసరమైన క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పల్లెలు, పట్టణాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు సంకల్పించారన్నారు. పట్టణాల్లో ప్రతి రోజు ఒకే సమయానికి నల్లాల ద్వారా నీరు సరఫరా చేయాలని, పాఠశాలలు, ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, త్వరలోనే నియామకాలు జరగనున్నాయన్నారు. రాష్ట్రంలో ఎర్లీ బర్డ్‌ పథకం కింద అత్యధిక పన్ను వసూళ్లతో జహీరాబాద్‌ తొలిస్థానంలో నిలవడంపై అభినందించారు.

కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు.. సభ్యత్వాలు..

మండలాలు, నియోజకవర్గాల వారీగా నీటి వనరుల లెక్క తేల్చాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా మత్స్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలనే డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉందని, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ వారి సమస్యలు, డిమాండ్లపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిద్దిపేట జిల్లాలో 381 నీటి వనరులకు, మెదక్‌లో 235, సంగారెడ్డిలో 196 వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‌, యాదవరెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, కలెక్టర్లు హనుమంతరావు, హరీశ్‌, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం బూక్య, మున్సిపల్‌ కమిషనర్లు, ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు