logo

అతివకు సహకారం.. అభ్యున్నతికి ప్రోత్సాహం

సహకార బ్యాంకులు.. అన్నదాతలకు అన్ని రకాలుగా చేదోడుగా నిలుస్తున్నాయి. వారికి అవసరం మేర రుణాలు అందజేస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మంజూరు

Updated : 20 May 2022 01:17 IST

మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో డీసీసీబీ ముందంజ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నుంచి పురస్కారం అందుకుంటున్న డీసీసీబీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి

సహకార బ్యాంకులు.. అన్నదాతలకు అన్ని రకాలుగా చేదోడుగా నిలుస్తున్నాయి. వారికి అవసరం మేర రుణాలు అందజేస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తూ భరోసా ఇస్తున్నాయి. ఇదంతా ఓ వైపు కాగా, మరోవైపు సేవలను మరింత విస్తృతం చేస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటుండటం విశేషం. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పొదుపు సంఘాలకు రుణాలు పంపిణీ చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మెదక్‌ డీసీసీబీ 2021-22 సంవత్సరానికి తొలి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో 43 సహకార బ్యాంకుల శాఖలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా తమ పరిధిలోని రైతులకు రుణాలు అందిస్తుండగా, మరో అడుగు ముందుకేసి మహిళలకు సైతం మంజూరు చేస్తున్నాయి. తద్వారా వారు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 2021-22 సంవత్సరంలో 10,310 సంఘాలకు రూ.325.40 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. డీసీసీబీల పరిధిలో పొదుపు సంఘాలకు రుణాల పంపిణీ ఇదే అత్యధికం. బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా డీసీసీబీ అధ్యక్షులు దేవేందర్‌రెడ్డి పురస్కారం అందుకున్నారు. 2019-20లోనూ మెదక్‌ డీసీసీబీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2020-21లోనూ ముందున్నా కరోనా కారణంగా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.

వివిధ అంశాలపై..

నాబార్డు సహకారంతో మహిళా సంఘాల సభ్యుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు డీసీసీబీ తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పక్కాగా సమావేశాలు జరపడం, పుస్తకాల నిర్వహణతో పాటు ఏ అంశాలు చర్చించుకోవాలన్నది దిశానిర్దేశం చేశారు. తీసుకునే రుణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పొదుపు పాటించే తీరు, వాయిదాలు సక్రమంగా చెల్లించడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంఘాల సమావేశాల్లో కళాజాత బృందాల ద్వారా ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. బ్యాంకు రుణాలతో ఆర్థికంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు.

బీమాతో ధీమా..

బీమా పథకాల ఆవశ్యకతను మహిళా సంఘాల సభ్యులకు వివరిస్తున్నారు. ఆయా వాటిల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఏడాదికి రూ.12 చెల్లిస్తే ప్రమాద బీమా, రూ.330తో సాధారణ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రమాద బీమా చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు, సాధారణ బీమా పథకంలో చేరిన వారు ఆత్మహత్య మినహా ఎలా మృతి చెందినా రూ.2 లక్షలు, రెండు బీమా పథకాల్లో చేరితే రూ.4 లక్షలు సాయం అందిస్తారు. ఈ అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ సద్వినియోగం చేసుకునేలా చూస్తున్నారు.

సమష్టి కృషితో..

- చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు

రుణాల పంపిణీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఉద్యోగులు, పాలకవర్గం సమష్టిగా కృషితో ఇది సాధ్యమైంది. పురస్కారంతో బాధ్యత మరింత పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. అర్హత ఉన్న సంఘాల సభ్యులు బీమా పథకాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల నుంచి వసూలైన వడ్డీలో కొంత భాగాన్ని తిరిగి వారికే అందజేస్తున్నాం.


శుద్ధిజల ప్లాంటు నిర్వహణ

పొదుపు చేయడంలోనే కాదు.. వ్యాపార నిర్వహణలోనూ ముందుంటోంది నర్సాపూర్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మమత. డీసీసీబీ నుంచి రూ.1.80 లక్షల రుణంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. ఐదేళ్ల క్రితం బంతి పువ్వు పేరిట గ్రామంలో స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేయగా.. అందులో సభ్యురాలిగా చేరింది. నిర్దేశించి మేర పక్కాగా పొదుపు చేస్తూ వచ్చారు. స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో రుణం తీసుకున్నారు. నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసి భర్త ఆంజనేయులు సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.20 వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తమ పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. కుటుంబ అవసరాలకు పోనూ మిగతా సొమ్మును క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నారు.

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌


రుణ పరిమితి పెంపు..

ప్రస్తుతం ఒక్కో సంఘానికి గరిష్ఠ రుణ సదుపాయం రూ.10 లక్షలుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాన్ని రూ.12 లక్షలకు పెంచారు. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంఘాలకు రూ.20 లక్షలు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. దీంతో మహిళలు చిరు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహించనున్నారు. ఈ దిశగా అడుగులు వేయించేందుకు ప్రణాళిక రూపొందించి అడుగులు వేస్తున్నారు.

* డీసీసీబీ బ్యాంకు పరిధి సంగారెడ్డి జిల్లాలోని మహిళా సంఘాలకు 2020 జులై 1 నుంచి వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి సంఘాల అభ్యున్నతికి తిరిగి ఇస్తుండటం విశేషం. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో డీసీసీబీ, సెర్ప్‌ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వసూలైన వడ్డీలో 5 శాతం తిరిగి చెల్లిస్తున్నారు. మరో రూ.50 లక్షలు వడ్డీ రాయితీ రూపంలో చెల్లించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకు కార్యాచరణ రూపొందించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని