logo

పట్టు విస్తరణకు కసరత్తు

పట్టుపరిశ్రమ వ్యవసాయ ఆధారిత లాభదాయకమైన కుటీర పరిశ్రమ. ఒక ఎకరంలో మల్బరీ సాగు చేపడితే 5 నుంచి 10 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమకు జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా

Published : 20 May 2022 01:15 IST

ఈ ఏడాది లక్ష్యం 200 ఎకరాలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

సంగారెడ్డిలో మల్బరీ తోట

పట్టుపరిశ్రమ వ్యవసాయ ఆధారిత లాభదాయకమైన కుటీర పరిశ్రమ. ఒక ఎకరంలో మల్బరీ సాగు చేపడితే 5 నుంచి 10 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమకు జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మల్బరీ తోటల విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించింది. కొత్తగా ముందుకు వచ్చే రైతులకు రాయితీలు ఇచ్చేందుకు జిల్లాకు లక్ష్యాలను నిర్దేశించిన నేపథ్యంలో కథనం

నర్సరీల్లో మొక్కలు సిద్ధం

పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మల్బరీ మొక్కలు పెంచుతున్నారు. సంగారెడ్డిలోని విత్తన క్షేత్రంలో 1.60 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత సంవత్సరం మొక్కల కొరతతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఈ ఏడాది ఆ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సీజన్‌లో నాటేందుకు వీలుగా మొక్కల్ని పెంచారు. ఒక్కో మొక్కను రూ.2 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. మల్బరీ తోట వేశాక పట్టుపురుగులు పెంచాల్సి ఉంటుంది. మల్బరీ మొక్క ఒకసారి నాటితే 15-20 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ద్వారా..

మల్బరీ తోట వేసేందుకు ముందుకు వచ్చే జనరల్‌ కేటగిరీ రైతులకు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.32,500, పట్టుపురుగులు పెంచేందుకు గది నిర్మాణానికి జనరల్‌కు రూ.2లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.2.60లక్షలు, పట్టు పురుగులు పెంచే పరికరాలకు కూడా రాయితీ అందజేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం నుంచి కొత్తగా వ్యాధినిరోధక ద్రావకాల మిశ్రమం తయారు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాంకు నిర్మాణానికీ నిధులు కేటాయిస్తున్నారు. షేడ్‌నెట్‌లో స్టాండ్ల ఏర్పాటుకు రూ.10,200 ఇస్తున్నారు.

ఇప్పటికే 300 ఎకరాల్లో..

జిల్లాలో ఇప్పటికే 300 ఎకరాల్లో మల్బరీ సాగు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 200 ఎకరాల సాగుకు లక్ష్యాలను నిర్దేశించారు. మల్బరీ మొక్కలు కూడా సిద్ధంగా ఉండటంతో లక్ష్యాలను చేరుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. ఆసక్తి ఉన్న రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు కేటాయింపు ప్రాతిపదికన మంజూరు చేయనున్నారు.

రైతులను ప్రోత్సహిస్తున్నాం

-శ్రీనివాస్‌రావు, జిల్లా పట్టుపరిశ్రమ జిల్లా అధికారి

పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం మల్బరీ తోటల విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే పట్టుపరిశ్రమతో మెరుగైన లాభాలు ఉంటాయి.

ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీ

ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కల్గి ఉన్న వారు అర్హులు. ఐదు ఎకరాలు మించకుండా ఉన్న రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీ అందజేస్తారు. మల్బరీ తోట నిర్వహణకు మూడు సంవత్సరాలకు గానూ రూ.1,13,500, పట్టుపురుగులు పెంచే గది నిర్మాణానికి రూ.1.03లక్షలు రాయితీగా అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని