logo

సరికొత్త ఆలోచన.. ఆదాయానికి ఆలంబన

ఆయిల్‌పామ్‌.. దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలను అందించే ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. పలు రకాల రాయితీలను సైతం కల్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం

Published : 21 May 2022 01:26 IST

ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటల సాగు
న్యూస్‌టుడే, ములుగు

ఎర్రవల్లిలో సాగు చేసిన వేరుసెనగ

యిల్‌పామ్‌.. దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలను అందించే ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. పలు రకాల రాయితీలను సైతం కల్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంట నాటినప్పటి నుంచి మూడున్నరేళ్ల తర్వాత ఫలసాయం రైతుకు అందుతుంది. అప్పటివరకు ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటలు సాగు చేసేలా సూచనలు చేయడంతో పలువురు ఈ దిశగా అడుగేసి లాభాలు ఆర్జిస్తుండటం గమనార్హం.

3500 ఎకరాల్లో..
సిద్దిపేట జిల్లాలో అధికారుల రికార్డుల ప్రకారంగా 3500 ఎకరాలలో రైతులు ఆయిల్‌పామ్‌ తోటలు వేశారు. 90 శాతం రాయితీపై ప్రభుత్వం మొక్కలు, డ్రిప్‌ పరికరాలు, ఎరువులు అందించింది. ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన రైతులందరూ దిగుబడులు వచ్చే వరకు ఎదురుచూడకుండా ఆ తోటల్లో అంతర పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచనల మేరకు అంతర పంటలు పండించారు.

అన్ని రకాలుగా..
ఒక్కో ఆయిల్‌పామ్‌ మొక్క 9 మీటర్ల మేర దూరం నాటడం వల్ల సూర్యరశ్మి బాగా అందడంతో పాటు పోషకాలు సైతం సమృద్ధిగా అందే వీలుంటుంది. ఇది అంతర పంటల సాగుకు కలిసొచ్చే అంశం. రెండు పంటలకు వేర్వేరుగా నీరు, ఎరువులు అందించే అవకాశం ఉంటుంది. దీని వల్ల వేరే పంటలు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వేరుసెనగ, శనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసర, మొక్కజొన్న వంటి వాటిని అంతరంగా సాగు చేస్తున్నారు. ఇవన్నీ మంచి లాభాలు అందించేవి కావడంతో రైతులకు అదనపు ఆదాయం పక్కాగా మారింది.


అదనంగా ఆదాయం: రాజిరెడ్డి, ఎర్రవల్లి
3 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ తోట వేశా. ఈ పంట ఉత్పత్తులు చేతికి రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదురుచూడకుండా వేరుసెనగ, మినుములు అంతరంగా సాగు చేస్తున్నా. మినుములు చేతికిరాగా మంచి లాభాలు వచ్చాయి. రైతులందరూ ఇలా అడుగేస్తే ఎన్నో లాభాలున్నాయి.


అధికారుల సూచనలతో..: సుధాకర్‌రెడ్డి, ఎర్రవల్లి
నేను 5 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పండిస్తున్నా. అధికారుల సూచనలతో వేరుసెనగ, పొద్దుతిరుగుడు, పెసర వేశాను. ఆయా పంటలు చేతికి వచ్చాయి. మార్కెట్‌లో మంచి ధర పలకడంతో రూ.90 వేల వరకు మిగిలింది. ఇలా కొత్తగా ఆలోచిస్తే లాభాలు పొందడం ఎంతో సులభం.


రైతుల్లో మార్పు రావాలి: నాగేందర్‌రెడ్డి, ఏవో, మర్కూక్‌
పంటల సాగులో రైతులు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండాలి. దీర్ఘకాలిక పంటలు వేసినప్పుడు వాటి వల్ల ఫలసాయం అందడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ఖాళీగా ఉండే భూమిలో అంతర పంటలు వేస్తే లాభదాయకం. ఆయిల్‌పామ్‌ తోటల్లో ఇలా అదనంగా ఆదాయం పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని