logo

ఆర్థిక, సామాజిక వృద్ధి.. స్వనిధి సే సమృద్ధి

వీధి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. స్వయం సమృద్ధి సాధించేందుకు వెన్నుతడుతున్నాయి. ఆర్థిక, సామాజికంగా పురోభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధిలో భాగంగా

Published : 21 May 2022 01:26 IST

సిద్దిపేట బల్దియాలో అమలు
న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేట మున్సిపాలిటీ వద్ద వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

వీధి వ్యాపారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. స్వయం సమృద్ధి సాధించేందుకు వెన్నుతడుతున్నాయి. ఆర్థిక, సామాజికంగా పురోభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధిలో భాగంగా రుణాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ‘స్వనిధి సే సమృద్ధి’ ద్వారా వారి కుటుంబాల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమ అమలుకు సిద్దిపేట బల్దియా ఎంపికైంది.

స్వనిధి సే సమృద్ధి.. వీధివ్యాపారులకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టారు. గత ఏడాది రాష్ట్రంలో తొమ్మిది పట్టణాల్లో వర్తింపజేయగా.. ఈసారి 31 పట్టణాల్లో అమలు కానుంది. అందులో సిద్దిపేట ఒకటి. జిల్లా కేంద్రంలో 5450 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 20 వేలకు పైమాటే. పీఎం స్వనిధి రుణాల్లో తొలి విడతలో పట్టణం ప్రత్యేకత చాటింది. రూ.10 వేల చొప్పున పూచీకత్తులేని రుణం పొందిన పలువురు వ్యాపార వృద్ధికి సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేటను ‘స్వనిధి సే సమృద్ధి’కి ఎంపిక చేశారు. మొత్తం ఐదు శాఖల భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో వివరాల సేకరణ మొదలైంది. సంక్షేమ, పౌరసరఫరాలు, బ్యాంకింగ్‌, కార్మిక, మున్సిపల్‌ శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. ఆయా శాఖలు ప్రతి నెలా సమావేశాలు చర్చించి.. సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించనున్నారు.

రుణాలు.. పింఛన్లు..
అర్హులైన వీధి వ్యాపారులకు రూ.20 వేల రుణం అందించి నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. చిరు వ్యాపారంలో క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తే నెలకు రూ.100 నుంచి 300 వరకు క్యాష్‌బ్యాక్‌ వర్తింపజేస్తారు. బ్యాంకుల ద్వారా వారి కుటుంబాల్లోని 18 మొదలు 60 ఏళ్లలోపు వారికి బీమా సదుపాయం కల్పిస్తారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద శూన్య ఖాతా ఇప్పించనున్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాందాన్‌ యోజన కింద పింఛన్లు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారు సమ్మతి మేరకు ప్రతి నెలా  ఖాతా నుంచి నిర్దేశిత సొమ్మును తీసుకోనున్నారు. 60 ఏళ్ల నుంచి పింఛను సొమ్ము ఇవ్వనున్నారు. ప్రసూతి లబ్ధి కల్పించనున్నారు. జననీ సురక్ష యోజన కింద సేకరించిన వివరాలను వైద్యారోగ్య శాఖకు పంపించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు కావాల్సిన సేవలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. మాతృవందన యోజన కింద గర్భిణులకు పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించనున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో భాగంగా కార్మిక సంక్షేమ, ఈశ్రమ్‌ కార్డులు జారీ చేయనున్నారు. మెప్మా జిల్లా పీడీ హన్మంతరెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని