logo

కోల్పోయినా.. కనికరించలే!

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ (జీపీ) బల్దియా పరిధిలో రహదారుల విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల నేతలు వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల బాధితులకు రెండు పడక గదులు ఇళ్లు

Published : 21 May 2022 01:26 IST

అందని పరిహారం..
ఇళ్ల కేటాయింపులో ఇష్టారాజ్యం
న్యూస్‌టుడే, గజ్వేల్‌

గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజ్ఞాపూర్‌లో కూల్చివేసిన ఇళ్లు

జ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ (జీపీ) బల్దియా పరిధిలో రహదారుల విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల నేతలు వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల బాధితులకు రెండు పడక గదులు ఇళ్లు కేటాయిస్తుండగా మరి కొన్నిచోట్ల మొండిచేయి చూపుతున్నారని  బాధితులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారంతోపాటు పట్టణాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఐదేళ్లుగా జీపీ బల్దియా పరిధిలో రోడ్ల విస్తరణ చేపడుతోంది. ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్‌-గజ్వేల్‌ ప్రధాన రహదారి, పిడిచేడు, సంగాపూర్‌ మార్గాలను నాలుగు వరుసలుగా విస్తరించారు. ఈనేపథ్యంలో దాదాపు 160 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయి. పాతిక మందికిపైగా పూర్తిగా ఇళ్లను కోల్పోయారు. ఆ సమయంలో వారికి అధికారులు, నేతలు పలు హామీలు ఇచ్చారు. 50 శాతంలోపు ఇల్లు కోల్పోతే మరమ్మతులకు డబ్బులు ఇస్తామని.. 75 శాతానికి పైగా కూల్చివేస్తే.. ప్రత్యామ్నాయంగా మరోచోట రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. ఇంత వరకు ఎవ్వరికీ పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. గజ్వేల్‌ ఇందిరాపార్కు నుంచి కోటమైసమ్మ దేవాలయం రోడ్డు విస్తరణకు ఇళ్ల కూల్చివేత సాగుతోంది. ఇందులో 155 ఇళ్లను గుర్తించగా ఇప్పటిదాకా 126 కూల్చివేశారు. 37 మందికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశారు. గజ్వేల్‌ నుంచి దాచారం వరకు విస్తరిస్తున్న రహదారిలో దాదాపు పాతిక ఇళ్ల వరకు కూల్చివేస్తున్నారు. ఇక్కడా పలురికి ఇళ్లు మంజూరు చేశారు. బాధితులు అందరికీ ఒకే తీరున కాకుండా కొందరికే ఇళ్లు ఇవ్వటం వెనక స్థానిక నేతలు చక్రం తిప్పారన్న ప్రచారం సాగుతోంది.


ప్రజ్ఞాపూర్‌కు చెందిన వడ్డెపల్లి వెంకటేశం.. రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటిని పూర్తిగా కోల్పోయారు. కుటుంబంతో అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రెండు పడక గదుల ఇల్లు కేటాయింపునకు అధికారులు సర్వే చేపట్టారు. ఈక్రమంలో తనకు ఇల్లు ఇస్తారా లేదా అనే బెంగ పెట్టుకున్నారు. అధికారుల వద్దనే గతేడాది సెప్టెంబరులో గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. దీంతో వెంకటేశం కుటుంబం రోడ్డుపాలైంది. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఇల్లు కేటాయించలేదు.


‘పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇంటిని రోడ్డు విస్తరణ కోసమని కూల్చేశారు.. రాజకీయ నాయకులొచ్చి పరిహారం కింద రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని చెప్పిపోయిండ్రు.. ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఎవ్వరు రాలే.. పైసా పరిహారం ఇవ్వలే ఇళ్లను కేటాయించలే.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులతో రేకుల ఇంటిలో ఉంటున్నం.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ కనికరించటం లేదు’.  

- ఇది ప్రజ్ఞాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకుల భారతమ్మ ఆవేదన.


పంపిణీ ఎప్పుడో..
రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రెండు పడక గదుల గృహాల పంపిణీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన నేతలు... నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు బాధితులు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కొందరు అప్పులు చేసి సగం కూలిపోయిన ఇంటిని బాగు చేసుకున్నారు. ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోవటంతో అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం..
- ముత్యంరెడ్డి, గడా ఓఎస్డీ

రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం. వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తాం. ప్రస్తుతం రోడ్ల విస్తరణ జరుగుతున్న చోట బాధితులకు ప్రభుత్వ సూచనల మేరకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని