logo

నిఘా నీడన పది పరీక్షలు!

కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రెండేళ్ల తర్వాత పదో తరగతి ప్రధాన పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమైంది. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు సిలబస్‌ను, ప్రశ్నాపత్రాలను కుదించారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్‌తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది....

Published : 21 May 2022 01:26 IST

పకడ్బందీగా ఏర్పాట్లు

‘న్యూస్‌టుడే’తో జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్‌

న్యూస్‌టుడే, మెదక్‌

చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు

రోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రెండేళ్ల తర్వాత పదో తరగతి ప్రధాన పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమైంది. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు సిలబస్‌ను, ప్రశ్నాపత్రాలను కుదించారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి సీసీ కెమెరాల నిఘా నడుమ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్‌తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..

గంట ముందు చేరుకోవాలి..
జిల్లాలో ఈనెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పరీక్షలకు 11,400 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకుగాను 72 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఉంటుంది. గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. దూర ప్రాంతాల వారికి పరీక్ష కేంద్రాల నుంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశాం. బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి కేంద్రాలకు వచ్చేందుకు స్థానికంగా ఆటోలను అందుబాటులో ఉంచాలని సూచించాం. అన్ని కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది.

ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా...
ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘానీడలో పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలో ఏడు పాఠశాలలకు ప్రహరీ లేదు. అక్కడ అదనంగా కెమెరాను ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి చేశాం. ప్రశ్నపత్రాలను తెరవడం, పరీక్ష ముగిసిన తర్వాత వాటికి సీల్‌ వేసేంత వరకు పర్యవేక్షణ ఉంటుంది.

మౌలిక వసతుల కల్పన
తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్రాల వద్ద వైద్య సౌకర్యం అందించేందుకు ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. శౌచాలయాల నిర్వహణ బాధ్యతలను పంచాయతీ, మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాం.


కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం..  

విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే డీఈవోతో పాటు మండలాల వారీగా విద్యాశాఖ అధికారులను చరవాణుల్లో సంప్రదించవచ్చు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశాం. పరీక్షల సహాయ కమిషనర్‌ 94916-76947, నోడల్‌ అధికారి 94412-75039, జిల్లా విద్యాశాఖ అధికారి 81069-99625 నంబర్లలో సంప్రదించవచ్చు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల వారు యాదగిరి(ఎంఈవో) 94404-37801, మెదక్‌, హవేలిఘనపూర్‌, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్‌, రామాయంపేట, నిజాంపేట మండలాల వారు నీలకంఠం (ఎంఈవో) 94409-67306, నర్సాపూర్‌, శివ్వంపేట,  కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, చేగుంట, నార్సింగి, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల వారు బుచ్చానాయక్‌ (ఎంఈవో) 63005-83638 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.


ఆందోళన వద్దు..
గత సెప్టెంబర్‌లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నాటి నుంచి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. సిలబస్‌ కుదించడం, ప్రశ్నాపత్రాలను తగ్గించడం వల్ల విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా.. మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.


చరవాణులకు అనుమతి లేదు..
చరవాణులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదు. పరీక్ష కేంద్రంలో ఉండే సిబ్బందికి ఐడీ కార్డులు అందజేస్తున్నాం. మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 17 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో పర్యవేక్షణ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని