logo

బస్తాకు రూ.5 అదనం!

వెల్దుర్తి మండలం అందుగులపల్లికి చెందిన రైతు శ్యాంప్రసాద్‌కు 201 బస్తాల ధాన్యం పండింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేయించిన తర్వాత లారీలు రాలేదు. దీంతో గ్రామంలో పాండు అనే వ్యక్తితో మాట్లాడుకొని ఆయన ట్రాక్టర్‌లో ధాన్యాన్ని వెల్దుర్తిలోని ఒక రైస్‌మిల్లుకు తెచ్చాడు. కేంద్రం నిర్వాహకుల సూచన మేరకే ఆయన ఇలా చేశారు. ఈనెల 20న మిల్లుకు వచ్చాడు. పరీక్షించిన మిల్లు యజమాని...

Published : 22 May 2022 02:31 IST

 ఇవ్వకపోతే ధాన్యం తరలించట్లేదంటున్న రైతులు

 కొనుగోలు కేంద్రాల్లో తప్పని తిప్పలు

వెల్దుర్తిలోని ఓ రైస్‌మిల్లు వద్ద ధాన్యం బస్తాలతో బారులు దీరిన ట్రాక్టర్లు

వెల్దుర్తి మండలం అందుగులపల్లికి చెందిన రైతు శ్యాంప్రసాద్‌కు 201 బస్తాల ధాన్యం పండింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేయించిన తర్వాత లారీలు రాలేదు. దీంతో గ్రామంలో పాండు అనే వ్యక్తితో మాట్లాడుకొని ఆయన ట్రాక్టర్‌లో ధాన్యాన్ని వెల్దుర్తిలోని ఒక రైస్‌మిల్లుకు తెచ్చాడు. కేంద్రం నిర్వాహకుల సూచన మేరకే ఆయన ఇలా చేశారు. ఈనెల 20న మిల్లుకు వచ్చాడు. పరీక్షించిన మిల్లు యజమాని... పొల్లు ఉందని, వెనక్కితీసుకెళ్లాలని సూచించారు. అదేంటని రైతు ప్రశ్నిస్తే... తామేమీ చేయలేమన్నారు. మళ్లీ తీసుకెళ్లి తూర్పారబట్టి... మరోసారి తూకం వేయించుకొని రావాలని చెప్పడం గమనార్హం. అప్పటికే రెండు కిలోల 200 గ్రాముల మేర తరుగు తీశారని చెప్పినా వారు మాత్రం వినలేదు. ధాన్యం దించుకోలేక ఇలా ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి పంపేస్తున్నారని రైతు శ్యాంప్రసాద్‌ ఆవేదనగా తెలిపారు. మరో ట్రాక్టరులో ఉన్న వడ్లనూ ఇలాగే వెనక్కి పంపించారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకునేందుకు వచ్చిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలు, అధికారుల పర్యవేక్షణ లోపంతో తీవ్ర ఇక్కట్లతోపాటు ఆర్థిక భారంతో సతమతమవుతన్నారు. 17 శాతం తేమ మించొద్దనే నిబంధన ఉన్నా... 14 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తూకం వేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇది అన్నదాతలకే భారంగా మారుతోంది. బస్తాకు ఇంతని అదనంగా ఇచ్చుకోవడం మొదలు... కేంద్రం నుంచి మిల్లుకు బస్తాలు వెళ్లే వరకు వారినే బాధ్యులుగా చేస్తున్నారు. చాలా మంది రైతులే ట్రాక్టర్లు అద్దెకు తీసుకొని మిల్లులకు తరలించే పనిలో పడ్డారు. మెదక్‌ జిల్లాలోని శివ్వంపేట, వెల్దుర్తి, నర్సాపూర్‌, పెద్దశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, చిలప్‌చేడ్‌ తదితర మండలాల్లో ‘ఈనాడు’ పరిశీలన చేపట్టగా... అన్నదాతల అవస్థలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తే... తమకు అన్ని విధాలా నష్టమే మిగులుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రైతు పేరు భిక్షపతి. వెల్దుర్తి మండలంలోని జలాల్‌పూర్‌. నాలుగెకరాల్లో పంట కోసి దాదాపు ఏడు రోజుల క్రితం ధాన్యాన్ని ఆరబోశారు. తేమ 14 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పడంతో బాగా ఎండే వరకు ఆరబెట్టారు. వాస్తవానికి తేమ శాతం 17 మించితే ధాన్యం కొనుగోలు చేయవద్దనేది నిబంధన. చాలా కేంద్రాల్లో 12 నుంచి 14 శాతం వరకు తేమ ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కచ్చితంగా తేమ 14శాతం లోపు ఉండాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల వద్ద ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో మాత్రం తేమ శాతం 17 లోపు ఉంటే చాలని చెబుతున్నారు.

చిత్రంలో కనిపిస్తున్నది శివ్వంపేట మండలం చెన్నాపూర్‌కు చెందిన రైతులు. స్థానికంగా ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు మూడు రోజులకోసారి కూడా లారీ రావడం లేదు. అప్పటి వరకు తూకం వేసిన ధాన్యానికి తామే కాపలాగా ఉండాల్సి వస్తోందని వారు వివరించారు. ఒకవేళ వర్షం పడి తడిస్తే... తూకం వేసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోసి... తూకం వేయక తప్పడం లేదన్నారు. అందుకే ఎలాగోలా ధాన్యాన్ని మిల్లుకు పంపేలా చూస్తున్నామంటున్నారు. తమ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని లారీల వాళ్లు బస్తాకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. అధికారులు ఆపి తమకు అప్పగించిన లారీల వాళ్లయితే బస్తాకు రూ.10 వరకు తీసుకున్నారని శ్రీనివాస్‌ వివరించారు. మిల్లు వద్ద ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోందని, అదనపు వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి. ఇదే మండలంలోని చండిలో మొన్నటి వరకు బస్తాకు అదనంగా రూ.5 వసూలు చేశారు. ఇప్పుడు దానిని రూ.6కు పెంచారు.

మరికొన్ని చోట్ల...

* శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల ఐకేపీ కేంద్రానికి రోజుకు రెండు లారీలు వస్తే సమస్య ఉండదు. రెండు రోజులకోసారి ఒక లారీ వస్తోంది. దీంతో నిత్యం దాదాపు 2వేల బస్తాలు తూకం వేసినవి ఉంటున్నవి. మిల్లుకు తరలించే వరకు రైతులే బస్తాలకు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి.
* హమాలీల కొరత చూపి ఒక్కో కేంద్రంలో ఒక్కోలా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల క్వింటాలుకు రూ.35 తీసుకుంటుండగా.. చాలా చోట్ల రూ.40 ఇవ్వాల్సి వస్తోంది. సుతీలు కూడా రైతులే తెచ్చుకోవాలని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
* పెద్దశంకరంపేట మండలం కొత్తపేటలో కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారే లారీలో ధాన్యాన్ని మిల్లుకు తరలించారు. కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. హమాలీలు రైతుల వద్ద బస్తాకు రూ.2 అదనంగా డిమాండ్‌ చేస్తున్నారు.
* పాపన్నపేట మండలంలోని కొత్తలింగాయిపల్లి, బాచారం, పొడ్చన్‌పల్లి, అమ్రియతండాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం తరలింపు సరిగా జరగడం లేదు. రామాయంపేట, నిజాంపేటల్లోని చాలా కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి.
ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, అప్పటి వరకు రైతులనే బాధ్యులను చేయడంతో చాలా మంది టార్పాలిన్లను కప్పి వర్షం నుంచి రక్షించుకుంటున్నారు. చాలా చోట్ల రహదారులపై ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాన పడితే వరద కిందకు చేరకుండా... చుట్టూ మట్టికట్టలు వేసుకుంటున్నారు.

- ఈనాడు, మెదక్‌ -న్యూస్‌టుడే, శివ్వంపేట
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని