logo

కఠోర శిక్షణ.. భవితకు నిచ్చెన

రగ్బీ.. ఎంతో కఠినమైన క్రీడ. ఇందులో వేగంతో పాటు ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల ఉంటేనే రాణించగలం. చురుకుదనం ఉండాలి. గాయపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఆటలో ఎంతో మంది అడుగుపెడుతుండగా తమదైన

Published : 22 May 2022 02:31 IST

న్యూస్‌టుడే, చేగుంట

రగ్బీలో సాధన చేస్తూ..

రగ్బీ.. ఎంతో కఠినమైన క్రీడ. ఇందులో వేగంతో పాటు ఓర్పు, నేర్పుతో పాటు పట్టుదల ఉంటేనే రాణించగలం. చురుకుదనం ఉండాలి. గాయపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఆటలో ఎంతో మంది అడుగుపెడుతుండగా తమదైన రీతిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ క్రీడలో మరింత మంది ప్రవేశించేందుకు ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగా రగ్బీ క్రీడాకారులకు నిలయమైన చేగుంటలో వేసవి క్రీడా శిబిరం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తర్ఫీదు పొందుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో శిబిరం తీరుతెన్నులపై కథనం.
గ్రామీణ ప్రాంతానికి క్రీడాకారులెంతో మంది రగ్బీలో రాణించాలన్న ఆసక్తి ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి అండగా నిలవాలన్న సదుద్దేశంతో చేగుంటలో రగ్బీ వేసవి శిబిరం నెలకొల్పారు. పిల్లలు భవిష్యత్తులో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ శిక్షకులు అందుబాటులో ఉండటం, ఈ ప్రాంతానికి చెందిన వారెంతో మంది ఈ ఆటలో ప్రవేశించి బహుమతులు సాధించడంతో ఇక్కడ సదరు శిబిరం ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది.

నెల రోజుల పాటు..
ఉమ్మడి జిల్లాలో ఒక్క చేగుంటలో సదరు శిబిరం కొనసాగుతోంది. రగ్బీ, టచ్‌ రగ్బీ ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షకుడు కరణం గణేష్‌రవికుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల ఆవరణలో నిత్యం శిక్షణ ఇస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. బంతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రత్యర్థికి అందకుండా గోల్‌ను ఎలా పూర్తి చేయాలన్న దానిపై తర్ఫీదు ఇస్తున్నారు. అండర్‌-14 నుంచి సీనియర్‌ విభాగం వరకు ఆసక్తి ఉన్న వారికి అవకాశం కల్పించారు. టచ్‌ రగ్బీలో.. బంతిని పట్టుకొని వెళ్తున్న వారిని రెండు చేతులతో టచ్‌ చేస్తే ఆగిపోవాల్సి ఉంటుంది. బంతిని ప్రత్యర్థి జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు శిక్షణ సాగనుంది.
త్వరలోనే రాష్ట్ర స్థాయి పోటీలు
త్వరలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ ప్రతిభ చూపే జిల్లా జట్టును ఇందులో నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది. చేగుంటలోని తెలంగాణ గిరిజన బాలికల క్రీడా గురుకులం నుంచి కొందరు ఇందులో పాల్గొంటున్నారు. రగ్బీలో ప్రతి జట్టులో ఏడుగురు ఆడాల్సి ఉంటుంది. వీరు చురుకుగా ఉండి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చిన గోల్‌ను కోల్పోతారు. ఇక్కడి శిబిరంలో కఠినమైన శిక్షణ పొందుతూ తమదైన ప్రత్యేకత చాటుతున్నారు. రగ్బీ శిక్షణ పొందేందుకు తమ పిల్లలను ఉత్సాహంగా పంపిస్తున్నారు పలువురు తల్లిదండ్రులు. ఇతర క్రీడలకంటే భిన్నంగా ఉండే ఈ ఆటలో పరిణతి సాధిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొనేందుకు వీలుంటుంది.
ఆసక్తితో వస్తున్నా: నరేష్‌, యాదగిరిగుట్ట
ఇతర ఆటల కంటే భిన్నమైనది కావడంతో నేర్చుకోవాలన్న తపనతో ఈ శిబిరంలో చేరాను. శిక్షణ ఎంతో మంచిగా ఉంది. వేగంగా పరుగుపెడుతున్నా. బంతిని అందుకునేందుకు పోరాటం చేస్తున్నాను. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో రాణిస్తానన్న నమ్మకం ఉంది.
జాతీయ స్థాయిలో..: శివశంకర్‌, చేగుంట
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందులో ప్రతిభను చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడమే ముందున్న లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నా. ఇతర ఆటల కంటే ఇదెంతో భిన్నమైనది. కఠినంగా ఉన్నా ఆడుతుంటే సంతోషంగా ఉంది.
సంతోషంగా ఉంది: వెన్నెల
గతంలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో ఆడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నా. నా భవిష్యత్తుకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నా.
తల్లిదండ్రుల ప్రోత్సాహం: గాయత్రి
రగ్బీ ఆట గురించి తల్లిదండ్రులు చెప్పాను. వారు ఏమాత్రం సంకోచించకుండా ఆడేందుకు ప్రోత్సహించారు. ఇక్కడ శిక్షకులు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. చిన్నతనం నుంచే ఈ ఆటలో ప్రావీణ్యం సాధించేందుకు దోహదం చేస్తుంది.
రతిభను గుర్తించేందుకు..: కరణం
గణేష్‌రవికుమార్‌, శిక్షకుడు

క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. ఆసక్తి ఉన్న వారికి అవకాశం ఇచ్చాం. నిత్యం వంద మంది వరకు వస్తున్నారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇందులో నుంచే ఎంపిక చేయనున్నాం. ఇందుకు కసరత్తు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని