logo

నిఘా నీడలో ‘పది’ పరీక్షలు

రెండేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ సౌకర్యాలతో పాటు ఏఎన్‌ఎంలు కూడా అందుబాటులో

Published : 22 May 2022 02:31 IST

 కేంద్రాలన్నింటా సీసీ కెమెరాలు
 విద్యార్థులూ.. ఒత్తిడికి లోనుకాకుండా రాయండి
 ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖిలో డీఈవో రాజేష్‌
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

రెండేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ సౌకర్యాలతో పాటు ఏఎన్‌ఎంలు కూడా అందుబాటులో ఉంటారని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌ పేర్కొన్నారు. అధైర్య పడకుండా.. ఒత్తిడికి లోనుకాకుండా రాయాలని ఆయన సూచించారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తామని,  గంట ముందుగానే చేరుకోవడం ఉత్తమమని చెప్పారు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రాయాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో ముఖాముఖిలో డీఈవో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే..
22,564 మంది విద్యార్థులు
117 కేంద్రాల్లో 22,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 11,564 మంది బాలురు, 11,089 బాలికలు. నిర్వహణ కోసం 117 మంది చొప్పున చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఉన్న ఐదు స్క్వాడ్‌ బృందాలు, 1286 మంది ఇన్విజిలేటర్లను నియమించాం.
చరవాణులకు అనుమతి లేదు..
విధుల్లో ఉండే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు చరవాణిలను ఇంటి వద్దనే ఉంచి రావాలి. కేంద్రంలో వీటికి అనుమతి లేదు. ఇక్కడ డిపాజిట్‌ చేస్తామంటే కుదరదు. పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశాం. వాటిని తప్పని సరిగా మెడలో ధరించాలి.
సమస్యలుంటే ఫోన్‌ చేయండి
కేంద్రాల వద్ద జిల్లా విద్యాధికారి, ఆయా మండల విద్యాధికారి ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాలి.  ప్రతి కేంద్రానికి ఈ విషయమై  సర్య్కులర్‌ పంపించాం. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే ఆయా నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. దీనితో పాటు పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన విధులు, పాటించకూడనివి కూడా ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నాం. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు
పరీక్షకు వచ్చే విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి. తొలి 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవాలి. ఆ తరువాత మొదట బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. మిగతా వాటిపై తర్వాత దృష్టి పెట్టాలి. ఇప్పటికే రెండుసార్లు ప్రీ ఫైనల్‌ పరీక్షలు రాసినందున కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా రాస్తే మంచి మార్కులు కచ్చితంగా వస్తాయి.
5 నిమిషాల వరకు అనుమతి
ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది.   9.35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను లోనికి అనుమతిస్తాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించాం. ఎక్కడైనా బస్సులు రాకుంటే, మా దృష్టికి తీసుకువస్తే ఆర్టీసీ అధికారులతో మాట్లాడతాం. కేంద్రం వద్ద 14 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలు మూసి ఉంచాలి. తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో నిఘా నీడలో పరీక్షలు జరుగుతాయి. 74 ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. 43 ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే ఉన్న వాటిని వినియోగించుకుంటాం. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు వినియోగించే గదితో పాటు వరండాలో ఇవి ఉంటాయి. ప్రశ్నపత్రం ఓపెన్‌ చేసినప్పటి నుంచి సీల్‌ వేసే వరకు కెమెరాల పర్యవేక్షణలోనే జరగాలి. ఈ క్రమంలో అక్రమాలకు ఆస్కారం ఉండదు.
చూచిరాతను ప్రోత్సహిస్తే  కఠినంగా వ్యవహరిస్తాం
పరీక్షల్లో చూచిరాతను ప్రోత్సహించే ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరిస్తాం. అక్టోబరు నాటికి సిలబస్‌ పూర్తి చేశాం. రెండు సార్లు ఫ్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధులను చేశాం.  
ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం: ఆర్టీసీ
పదో తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మక్త క్యాసారం నుంచి బయలుదేరి పెద్ద చల్మెడ, కంకోల్‌, బుదేరా పరీక్ష కేంద్రాల మీదుగా సదాశివపేట వరకు, మల్లికార్జునపల్లి నుంచి మునిపల్లి వరకు, ఆత్మకూరు నుంచి సదాశివపేట వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బస్‌ పాస్‌ ఉంటే విద్యార్థి నివాస ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రం వరకు రూట్‌ మారినా ఉచితంగా అనుమతిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 7392800834, 9491810630 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.జహీరాబాద్‌ పరిధిలోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డీఎం రజనీకృష్ణ పేర్కొన్నారు.   9154298656, 7382924743 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం పొందాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని