logo

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు

ఏ రంగమైనా సదుపాయాలు కల్పించడం, ప్రోత్సహించడం, వెన్నుతట్టడం చేస్తే రాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. చిన్ననాటి నుంచే శిక్షకుడి పర్యవేక్షణలో కఠోర సాధన చేయడం, ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. క్రీడా మైదానాలు...

Published : 23 May 2022 02:15 IST

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌ కోర్టుల ఏర్పాటుకు ఆదేశాలు

న్యూస్‌టుడే, మెదక్‌

వాలీబాల్‌ ఆడుతున్న క్రీడాకారులు (పాతచిత్రం)

రంగమైనా సదుపాయాలు కల్పించడం, ప్రోత్సహించడం, వెన్నుతట్టడం చేస్తే రాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం సాధించి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. చిన్ననాటి నుంచే శిక్షకుడి పర్యవేక్షణలో కఠోర సాధన చేయడం, ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. క్రీడా మైదానాలు పట్టణాల్లో కొన్ని ప్రాంతాలకే  పరిమితం అవగా, పల్లెల్లో అవి లేక సత్తా ఉన్న క్రీడాకారులు వెలుగులోకి రావడం లేదు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి మండలానికి కనీసం రెండు ప్రాంగణాలను ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేవలం ప్రాంగణాల ఎంపిక కాకుండా వివిధ క్రీడా కోర్టులు సైతం ఏర్పాటు చేయనున్నారు. వాటి చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

రాష్ట్ర రాజధానికి జిల్లా సమీపంలో ఉన్నా.. ఆయా క్రీడాంశాల్లో రాణించే క్రీడాకారులను వేళ్లపై లెక్కించవచ్చు. సరైన సదుపాయాలు, శిక్షకులు, మైదానాలు లేక యువత వెనుకబడి పోతున్నారు. జిల్లాలో కేవలం మెదక్‌ పట్టణంలో మాత్రమే క్రీడా మైదానం ఉంది. ఇందిరా గాంధీ స్టేడియంతో పాటు పీఎన్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియం కూడా కలదు. మిగిలిన పట్టణాలైన నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లో మైదానాలు లేవు. ఉమ్మడి చేగుంట మండలంలో ఆయా క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తాచాటిన క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడా మైదానం ఏర్పాటుకు స్థలం ఎంపిక చేయగా, నిధులకు ప్రతిపాదనలు పంపారు. ఇక గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఆవరణ లేదా ఖాళీ స్థలాల్లో వాలీబాల్‌, కబడ్డీ తదితర ఆటలు ఆడుతుంటారు.

ఖోఖో ఆడుతున్న చిన్నారులు (పాతచిత్రం)

ఇకపై ప్రతి గ్రామంలో....
గ్రామీణ క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరవైందన్న విమర్శ ప్రభుత్వంపై ఉండేది. ఈ అపవాదును తొలగించుకునేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఎకరం స్థలంలో వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులు సిద్ధం చేయాలని సూచించింది. ముందుగా ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేసి వాటిల్లో మూడు కోర్టులతో పాటు లాంగ్‌జంప్‌ పిట్‌తో పాటు వ్యాయామం చేసేందుకు ఒకటి, రెండు వరుసల లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్థల సమస్య ఉన్న పంచాయతీల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల్లో ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు  ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. క్రీడా మైదానాలు సాదాసీదాగా కాకుండా పల్లెప్రగతిలో కార్యక్రమాలను ఎలా శాశ్వత ప్రాతిపదికన చేపట్టారో... వీటిని కూడా అదే విధంగా చేపట్టాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి వాటి చుట్టూ హరితహారంలో మొక్కలు నాటనున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల పరిధిలోని పరిశ్రమలు ప్రతి ఏటా చెల్లించే సీఎస్‌ఆర్‌ నిధులతో క్రీడాకారులకు వసతులు సమకూర్చనున్నారు. తొలుత జూన్‌ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలు ఎంపిక చేయాలని ఆదేశించారు.


క్రీడాకారులకు ఉపయోగం
నాగరాజు, జిల్లా యువజన, క్రీడల అధికారి

అదనపు పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని 318 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎంపిక చేశాం. మండలానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాం. మిగిలిన పంచాయతీల్లో స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించడంతో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిరంతరం సాధనతో పాటు వ్యాయామానికి ఇవి దోహదం చేయనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని