logo

కొండపోచమ్మకు కొరవడిన భద్రత

కోటి ఎకరాల మాగాణికి సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జలాశయాల నిర్మాణాన్ని సంకల్పించారు. అందులో భాగంగా మర్కూక్‌ మండల పరిధిలో 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారు.

Published : 23 May 2022 02:15 IST

ఇటీవల కాలంలో నీట మునిగి ఆరుగురి మృతి

పట్టని నీటి పారుదల శాఖ అధికారులు, పోలీసులు

న్యూస్‌టుడే, ములుగు

కొండపోచమ్మ జలాశయం

కోటి ఎకరాల మాగాణికి సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జలాశయాల నిర్మాణాన్ని సంకల్పించారు. అందులో భాగంగా మర్కూక్‌ మండల పరిధిలో 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారు. అది రాష్ట్ర రాజధాని జంట నగరాలకు అత్యంత చేరువలో ఉండటంతో సెలవు రోజులు, ఆదివారం వచ్చిందంటే అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడి అందాలు వీక్షించేందుకు వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా వచ్చిన వారు నీటిని తాకాలనే ఉత్సాహంతో ప్రమాదం అంచుకు వెళ్లి ప్రాణాలు కోల్పోతుండటం పట్ల విచారం వ్యక్తం అవుతోంది.

పనిచేయని హెచ్చరికలు
జలాశయం ప్రారంభం నుంచి పర్యాటకుల వరద కొనసాగుతుండగా పలు సందర్భాల్లో మర్కూక్‌, ములుగు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి హెచ్చరిస్తూ వచ్చారు. అయినా చాలా మంది జలాశయంలోకి ఈత కొట్టడం, స్నానం చేయడం చేస్తున్నారు. కొంతమంది మద్యం మత్తులో నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు పట్టుతప్పి నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. ఇదివరకు వేర్వేరు సందర్భాల్లో ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆదివారం సరదాగా గడిపేందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇద్దరు నీట మునిగి చనిపోవడం విషాదం నింపింది.

ములుగు ర్యాంపు సమీపంలో జలాశయం కట్టపై పని చేయని సీసీ కెమెరా

కంచె వేస్తే మేలు
కొండపోచమ్మ జలాశయం కట్టపై పర్యాటకులు రాకపోకలు సాగించేందుకు నాలుగు చోట్ల ప్రత్యేకంగా ర్యాంపులను ఏర్పాటు చేశారు. కట్ట ఎత్తు తక్కువగా ఉండటంతో విద్యుత్తు స్తంభాలు ఉన్న చోటు నుంచి వారు జలాశయం లోనికి దిగుతున్నారు. నీటి సమీపంలో లేదా నీటిలోకి వెళ్లాలనే ఆకాంక్ష వారిని ప్రమాదంలోకి నెడుతోంది. వాస్తవానికి జలాశయం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయగా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. జలాశయంలోకి ఎవరూ వెళ్లకుండా కట్టలోపలి వైపు కంచె వేస్తే ప్రయోజనం ఉండనుంది. సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.

121 కెమెరాలు ఉన్నా ఉపయోగం సున్నా..
కొండపోచమ్మ జలాశయం హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండటంతో పర్యాటకులు అధికంగా వస్తారని భావించిన అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 16 కి.మీ. మేర విస్తరించి ఉన్న జలాశయం కట్ట చుట్టూ 121 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని మర్కూక్‌ ఠాణాకు అనుసంధానం చేశారు. ఎక్కడ ఏం చేసినా ఇట్టే తెలుసుకునేందుకు వీటిని బిగించారు. అవి ఏడాది పాటు బాగానే పని చేయగా ఆ తర్వాత నిర్వహణ లోపంతో పాడయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు పని చేయకపోగా ఎక్కువ వాటిని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని