logo

అటకెక్కిన ఆహ్లాదం..

నియోజకవర్గ, డివిజన్‌ కేంద్రం నర్సాపూర్‌లో కుంటల సుందరీకరణకు రెండేళ్ల క్రితం పురపాలిక అధికారులు ప్రతిపాదనలు పంపగా నేటికీ అవి అమలుకు నోచుకోలేదు. నిధుల మంజూరుకు ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందించి పంపగా ఒక్క

Published : 23 May 2022 02:12 IST

సుందరీకరణకు  నోచుకోని కుంటలు

ఎదురుచూస్తున్న  నర్సాపూర్‌ ప్రజలు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

అభివృద్ధికి నోచుకోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలోని కుంట

నియోజకవర్గ, డివిజన్‌ కేంద్రం నర్సాపూర్‌లో కుంటల సుందరీకరణకు రెండేళ్ల క్రితం పురపాలిక అధికారులు ప్రతిపాదనలు పంపగా నేటికీ అవి అమలుకు నోచుకోలేదు. నిధుల మంజూరుకు ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందించి పంపగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఆ కుంటలు కాస్తా ముక్కుపుటాలదిరే దుర్గంధాన్ని వెదజల్లుతూ, చెత్త కుండీలుగా మారి కంపు కొడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. పట్టణంలోని జల వనరుల భూములు రూ.కోట్ల విలువ పలుకుతుండగా వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో సుందరీకరణకు ప్రతిపాదించినా ఎవరికీ పట్టడం లేదు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

నర్సాపూర్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఆవరణలోని ఊర కుంటతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి. సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటలోకి సమీప దుకాణాల వారు చెత్తా చెదారం వేయడం, మురుగును వదలడం చేసేవారు. దీంతో అది కాస్తా దట్టమైన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ప్రయాణికులు మలమూత్ర విసర్జనతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టేది. పందుల సంచారం, ఈగలు, దోమల విజృంభణతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు ప్రధానంగా ఈ కుంటే కారణమని గుర్తించిన పురపాలిక దాన్ని సుందరీకరించి సమస్యల నుంచి గట్టెక్కాలని ప్రతిపాదించింది. ఇది పట్టణం మధ్యలో ఉండడంతో అందరికీ అనుకూలిస్తుందని, ఆహ్లాదాన్ని పంచుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.20 లక్షలు వ్యయం చేసి మొదట కుంట పూడ్చివేత చేపట్టడంతో అంతా సుందరీకరణకు అడుగులు పడ్డాయని సంతోషించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కుంటను పూడ్చినా సుందరీకరణ మాత్రం అటకెక్కింది. కుంట పూడ్చివేతతో సమీప విఘ్నేశ్వర కాలనీ  వాసులకు కొత్త సమస్య ఎదురైంది. చిన్నపాటి వర్షం పడినా కుంటలోకి వస్తున్న వరద నీరు కాలనీని ముంచెత్తుతోంది. రూ.20లక్షల నిధులతో కట్టను విస్తరించి వాకింగ్‌ ట్రాక్‌, ఆకాశ దీపాలు, బెంచీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కుంటను పూడ్చిన స్థలంలో పూల మొక్కలు పెంచి నందన వనంగా మార్చాలని ప్రతిపాదించారు.  

నర్సాపూర్‌లోని కోమటి కుంట

కోమటి కుంటదీ అదే పరిస్థితి..
పట్టణంలోని తూప్రాన్‌ మార్గంలో ఉన్న కోమటి కుంటది కూడా అదే దుస్థితి. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు, వ్యాపారులు చెత్త కుండీగా మార్చివేశారు. పురపాలిక సైతం పట్టణంలో సేకరించిన చెత్తను తరలించి ఇందులో పడవేసి కాల్చి వేస్తున్నారు. రెండేళ్ల క్రితం మిషన్‌ కాకతీయతో సుందరీకరించాలని ప్రతిపాదించగా మంత్రి హరీశ్‌రావు, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే సందర్శించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదం పంచాలని నిర్ణయించారు. కుంటలో బోటింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తామని అన్నా అవేవి ఆచరణకు నోచుకోలేదు. జాతీయ రహదానిని ఆనుకుని ఉన్న ఈ కుంట భూమి విలువ రూ.కోట్లల్లో ఉంటుంది. దీంతో క్రమంగా అక్రమార్కులు కుంట స్థలంపై కన్నేసి ఆక్రమించేస్తున్నారు. చిన్నచిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకుని కబ్జాకు పావులు కదుపుతున్నారు. సుందరీకరణ మాట అటుంచి కనీసం ఆక్రమణల పాలు కాకుండా కుంటను రక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


తగిన చర్యలు తీసుకుంటాం...
చాముండేశ్వరి, కమిషనర్‌, నర్సాపూర్‌ పురపాలిక

పురపాలికలోని రెండు కుంటల సుందరీకరణకు ప్రతిపాదించిన మాట వాస్తవమే. నిధులు మంజూరైతే పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితులను వివరించి వీలైనంత త్వరలో నిధులు మంజూరు చేయాలని కోరతాం. బస్టాండ్‌ ఆవరణలోని కుంటలోకి వచ్చే వరదను దారి మళ్లించడానికి మురుగు కాల్వ నిర్మాణం చేపట్టనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని