logo

పూర్తిస్థాయిలో ఇంటర్‌ మూల్యాంకన కేంద్రం సేవలు

ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది సిద్దిపేటలో ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ క్యాంప్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. గడచిన సంవత్సరం ప్రథమ సంవత్సర పత్రాలు

Published : 23 May 2022 02:12 IST

సబ్జెక్టుల వారీగా ప్రక్రియ మొదలు
సిద్దిపేట వేదికగా.. 1.80 లక్షల జవాబు పత్రాలు
న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల

ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది సిద్దిపేటలో ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ క్యాంప్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. గడచిన సంవత్సరం ప్రథమ సంవత్సర పత్రాలు మాత్రమే మూల్యాంకనం చేయగా.. ఈసారి పూర్తిస్థాయిలో కేంద్రం సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి సంస్కృతం సబ్జెక్టుతో లాంఛనంగా మొదలైంది. ఆదివారం నుంచి సబ్జెక్టుల వారీగా ప్రక్రియను ఆరంభించారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల అధ్యాపకులు.. సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల కేంద్రంగా ఈ క్రతువులో భాగస్వాములు అవుతున్నారు. మరో 20 రోజుల్లో శిబిరం పూర్తి కానుంది.

ఏటా ఇంటర్‌ పరీక్షలు ముగియగానే జవాబుపత్రాల మూల్యాంకనం అధ్యాపకులకు ఓ సవాలుగా మారేది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల అధ్యాపకులు.. సికింద్రాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది. దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ క్రమంలో సరైన వసతి లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారు. పలువురు నిత్యం రాకపోకలు సాగించే వారు. ఈ తరుణంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో గత ఏడాది ఇంటర్‌ విద్యా శాఖ మూల్యాంకన కేంద్రం మంజూరు చేసింది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల వేదికగా.. రాష్ట్రంలో 29వ క్యాంపుగా ఏర్పాటైంది. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 20, ప్రభుత్వ అనుబంధ 36, ప్రైవేటు 33 ఉండగా.. మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ 16, అనుబంధ 24, ప్రైవేటు 18 కళాశాలలు ఉన్నాయి. అవసరం మేర ఇరు జిల్లాల్లోని మొత్తం 147 కళాశాలలకు చెందిన దాదాపు వేయికి పైగా అధ్యాపకులు మూల్యాంకనానికి హాజరవనున్నారు. విడతల వారీగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పోలీసుల భద్రత, నిఘా నేత్రాల నడుమ ఈ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.  

తొలి విడత కోడింగ్‌ పూర్తి..
నాలుగు విడతల్లో మూల్యాంకనం జరగనుంది. తొలి విడతలో ఆంగ్లం, తెలుగు, గణితం, రాజనీతిశాస్త్రం, సంస్కృతం, హిందీ, రెండో విడతలో భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం, మూడో విడతలో రసాయన, వాణిజ్యశాస్త్రాలు, నాలుగో విడతలో చరిత్ర, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోని మొత్తం 13 సబ్జెక్టులకు సంబంధించి 1.80 లక్షల జవాబుపత్రాలు దిద్దనున్నారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు, పరిసర ప్రాంతాలు మినహా ఇతర జిల్లాలకు చెందినవి ఇక్కడ మూల్యాంకనం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో మూడు భవన సముదాయాల్లో 36 గదులు అందుకు అనువుగా ఉన్నాయి. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సూర్యప్రకాశ్‌ క్యాంప్‌ అధికారిగా, చీఫ్‌ కోడింగ్‌ అధికారిగా కూచంగారి శ్రీనివాస్‌, స్థానిక కళాశాల ప్రిన్సిపల్‌ సత్యనారాయణరెడ్డి జనరల్‌-1, సీహెచ్‌ శ్రీనివాస్‌ జనరల్‌-2 హోదాలో పర్యవేక్షిస్తున్నారు. వివిధ స్థాయిల్లో అధికారులు భాగస్వాములు అవుతున్నారు. తొలివిడతకు సంబంధించి జవాబుపత్రాల కోడింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఆదివారం దాదాపు 400 మంది అధ్యాపకులు విధుల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని