logo

యువత మార్గం.. సామాజిక దృక్పథం!

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉన్నారు.

Published : 23 May 2022 02:12 IST

భిన్న  సంస్కృతులకు వేదికైన శిబిరం
పాల్గొన్న 10 రాష్ట్రాల విద్యార్థులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, జోగిపేట

పరిసరాలు శుభ్రం చేస్తూ..

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉన్నారు. చదువుతోపాటు సమాజంలో మార్పు, ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కృషి చేస్తారు. సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయ సమైక్యతా శిబిరం ఇదే లక్ష్యంతో కొనసాగిన తీరుపై కథనం.

శ్రమదానంతో ఆరోగ్యానికి మేలని..
ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. ఇది లేకపోతే ఎంత సంపద ఉన్నా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ సమైక్యతా శిబిరంలో శ్రమదానం అంశాన్ని చేర్చారు. శ్రమదానం చేస్తే ఆరోగ్యానికి మేలు చేకూరడంతో పాటు మెరుగైన సమాజానికి ఇది బాటలు వేస్తుంది. ఎవరికి వారు శ్రమదానంతో తమ ఇంటి పరిసరాలను నిత్యం శుభ్రం చేసుకున్నా ఆ కాలనీ తద్వారా ఊరంతా పరిశుభ్రంగా మారుతుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ఇంతటితో ఆగకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్ద సైతం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేలా శిబిరంలో సంసిద్ధుల్ని చేశారు.

ప్రజల్ని చైతన్యం చేసేలా..
పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తమ సంపాదనలో అధిక మొత్తాన్ని చికిత్సల కోసం వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. దీనివల్ల ఎంత శ్రమించినా పేదరికంలోనే మగ్గుతున్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఆసుపత్రి ఖర్చులు తగ్గి పేదరికం నుంచి బయట పడేందుకు వీలుంటుంది. ఉపాధి హామీ పథకం ద్వారా శౌచాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సాయం అందిస్తున్నా చాలా మంది ముందుకు రావటం లేదు. శౌచాలయాలు నిర్మించుకున్న వారిలోనూ కొందరు వినియోగించడం లేదు. ఇలాంటి విషయాలపై ప్రజల్ని చైతన్యం చేసేలా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

బృంద ప్రదర్శనలు..
మన దేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ఇవన్నీ ఒకే వేదికపై చేరితే.. జాతీయ సమైక్యతా శిబిరంలో ఇదే జరిగింది. 10 రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు తమ ప్రాంతాల ప్రత్యేకను చాటారు. ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మొదటి రెండు రోజులు రాష్ట్రాలకు చెందిన ప్రదర్శనలు వేర్వేరుగా ఇవ్వగా ఆ తర్వాత రెండు, మూడు రాష్ట్రాల విద్యార్థులు కలిసి బృంద ప్రదర్శనలు ఇచ్చి.. భిÅన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు.

యోగాతో మొదలు
జాతీయ సమైక్యతా శిబిరం నిత్యం ఉదయం యోగాతో మొదలై రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది. యోగా అనంతరం రోజుకో అంశంపై తరగతులు నిర్వహించారు. ఇందులో మొక్కల సంరక్షణ, ఔషధ మొక్కలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, జీవన విధానం, నైతిక విలువలు అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

200 మంది వాలంటీర్లు
కేంద్ర మానవ వనరులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా శిబిరానికి దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, హరియాణా, గోవా, ఒడిశా, గుజరాత్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో ఉన్నారు.


ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కలిసిపోయా..
-దత్తు, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి

ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమైక్యతా శిబిరంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మొదట్లో మాట్లాడలేకపోయా. ఆ తర్వాత వారితో కలిసిపోయా. ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చర్చించే అవకాశం వచ్చింది. ఇతర రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన వచ్చింది. శిబిరానికి వచ్చిన అందరం కలిసి వాట్సాప్‌ సమూహంగా ఏర్పడి అన్ని విషయాలపై చర్చించుకుంటున్నాం. ఇంత కాలం ఒక్కడిగా ఉండి పనులు చేసుకునే తాను ఇపుడు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో మసలుకోవాల్సిన పద్ధతులు తెలుసుకున్నాం.


సమయం విలువ తెలిసింది
-మేఘన, కోటి ఉమెన్స్‌ కళాశాల, హైదరాబాద్‌

జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొనే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ శిబిరంలో సమయం విలువ తెలిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూలు ప్రకారం ముందుకు సాగాం. ముఖ్యమైన పనులకు ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రణాళిక ప్రకారం సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలుసుకోగలిగాం. యోగా, సాంస్కృతిక ప్రదర్శనలతో ఎంతో నేర్చుకున్నా.


విద్యార్థి జీవితంలో ఒకసారైనా పాల్గొనాలి
- నమామి, డిగ్రీ తృతీయ..

విద్యార్థి జీవితంలో ఒకసారైనా ఇలాంటి శిబిరంలో పాల్గొనాలి. ఇతర ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్ర్రాల నుంచి వచ్చే వారి ద్వారా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్న విషయాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే శిబిరంలో ప్రజలకు వివరిస్తా. ఆరోగ్యం, మొక్కలను కాపాడుకునే పద్ధతులు, ఇంకుడు గుంతల తవ్వకం వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని