logo

క్రైమ్‌ వార్తలు

ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి చిన్నలారీ ఢీకొట్టడంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృత్యువాత చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన గజ్వేల్‌ మండలం కోమటిబండ

Published : 23 May 2022 02:12 IST

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన చిన్న లారీ

మూడేళ్ల చిన్నారి మృత్యువాత, ముగ్గురికి గాయాలు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి చిన్నలారీ ఢీకొట్టడంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృత్యువాత చెందగా, ముగ్గురు గాయపడిన ఘటన గజ్వేల్‌ మండలం కోమటిబండ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వీరప్రసాద్‌ తెలిపిన వివరాలు.. వర్గల్‌ మండలం మజీదుపల్లి గ్రామానికి చెందిన కోడిపట్ల మహేశ్‌, మమత దంపతులకు కుమార్తె గగన (3), ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. బాబును గజ్వేల్‌లో ఆసుపత్రిలో చూపించేందుకని అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కోమటిబండ గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన చిన్నలారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డ గగన అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. వారం కిందటనే పాప పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అప్పుడే పాప శాశ్వతంగా దూరమవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  క్షతగాత్రులకు గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.


విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గోడ పటిష్టానికి నీరు పడుతున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలైన ఘటన మండల పరిధి అంతాయిగూడలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. జగదేవపూర్‌ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పోశమైన నరేశ్‌ (24) శనివారం రాత్రి 8 గంటల సమయంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గోడకు నీరు పట్టాలని భావించాడు. మోటారు నడవక పోవడంతో తీగలు తనిఖీ చేస్తుండగా విద్యుత్తు ప్రసరించే తీగను తాకాడు. కాళ్లకింద తేమ ఉండటంతో విద్యుదాఘాతం ప్రభావం అధికంగా ఉండి నరేశ్‌ కిందపడి గాయాల పాలయ్యాడు. సమీపంలో ఉండి చూస్తున్న గ్రామానికి చెందిన తిగుళ్ల కనకయ్య కర్రతో విద్యుత్తు తీగను లాగేశాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితికి చేరిన నరేశను కుటుంబ సభ్యులు 108 వాహనంలో గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యువకుడి తండ్రి పోశమైన రాములు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


నిద్ర మత్తులో భవనంపై నుంచి పడి..

మనూరు, న్యూస్‌టుడే: భవనంపై పడుకొని.. నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన మనూరు మండలం దోసపల్లిలో చోటుచేసుకుంది. మనూరు ఎస్‌ఐ లక్ష్మణ్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని బాదల్‌గామ్‌కు చెందిన చిప్ప శంకరప్ప(40) భవనంపై నుంచి కింద పడి మృతి చెందారు. శంకరప్ప దోసపల్లిలోని ఎర్రోల బాబు ఇంటికి శనివారం రాత్రి వచ్చారు. చీకటి పడటంతో బాబు ఇంటిపైన పడుకున్నారు. అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకుల వెంటనే ఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి కర్ణాటకలోని బీదర్‌కు తరలించారు. బీదర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య చిప్ప జగదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


చోరీ కేసులో నిందితుడి అరెస్టు

సదాశివపేట, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు.. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని సదాశివపేట సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన అలంపల్లి సామయ్య తన ఇంటిముందు ట్రాక్టర్‌ను నిలిపి ఉంచారు. ఈ నెల 21వ తేదీన ట్రాక్టర్‌ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పరిశోధనలో భాగంగా ఆదివారం జాతీయ రహదారిపై పెద్దాపూర్‌ వద్ద పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. మహ్మద్‌ షానవాజ్‌ ట్రాక్టర్‌ తీసుకొని వెళుతుండగా సిబ్బంది అడ్డుకొని పత్రాలు చూపించాలని కోరారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయ్నతించగా పట్టుకున్నారు. దొంగలించిన ట్రాక్టర్‌ను హైదరాబాద్‌లో అమ్మడానికి తీసుకెళుతుండగా.. పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని