logo

అత్యవసరానికి.. ఆరుబయటకే..!

తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారంతోపాటు, రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నారు. దీంతో వీటికి ప్రజల తాకిడి పెరిగింది. అయితే సరిపోను గదులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేక  వివిధ సేవలకు వచ్చిన

Published : 23 May 2022 02:12 IST

తహసీల్దార్‌ కార్యాలయాల్లో తప్పని అవస్థలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది, గుమ్మడిదల, మునిపల్లి, జహీరాబాద్‌ అర్బన్‌, జోగిపేట  

సంగారెడ్డిలో నిరుపయోగంగా..

తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూ సమస్యల పరిష్కారంతోపాటు, రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నారు. దీంతో వీటికి ప్రజల తాకిడి పెరిగింది. అయితే సరిపోను గదులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేక  వివిధ సేవలకు వచ్చిన వారికి అవస్థలు తప్పడంలేదు. అత్యవసరంలో ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆదాయమే లక్ష్యంగా సేవలందిస్తున్నా.. కనీస సదుపాయలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేవు. పూర్తి స్థాయిలో బల్లలు లేక, చెట్ల కిందే  ప్రజలు నిరీక్షిస్తున్నారు. మూత్రశాలలు, శౌచాలయాలు లేవు. పురపాలక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది. ఇక్కడికి రిజిస్ట్రేషన్లకు నిత్యం 15 నుంచి 20 మంది వరకు వస్తుంటారు. శుద్ధి చేసిన నీటి సౌకర్యం లేదు. వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రహదారిపై నిలపాల్సివస్తోంది. నిత్యం రూ.15నుంచి రూ.16లక్షల వరకు ఆదాయం వస్తున్నా మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించడంలేదు.

శౌచాలయాలు లేక
కందిలో శౌచాలయాలు లేవు. పంచాయతీ కార్యాలయంలోనే సేవలందిస్తున్నారు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ సౌకర్యం లేదు. రోజుకు 15 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్‌ సేవలు అమలువుతుంటాయి. సుమారుగా రూ.18లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. సౌకర్యాలు కల్పించడంలేదు.

గదులు సరిపోక
గుమ్మడిదల కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. సరిపోను గదులులేక అధికారులు, రిజిస్ట్రేషన్లకు వచ్చిన  వారికి అవస్థలు తప్పడం లేదు. ఆరుబయటే నిరీక్షించాల్సి వస్తోంది. బల్లలు ఏర్పాటు చేయలేదు. శౌచాలయాలు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. రోజుకు 10 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కోహీర్‌ కార్యాలయంలో తగినన్ని వసతులు లేవు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వాళ్లకు సరిపడా కుర్చీలు లేవు. చెట్ల కింద నీరిక్షించాల్సి వస్తోంది. రోజుకు 5 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సౌకర్యాలు లేక పోవడం వల్ల జనాలు ఇబ్బందులు తప్పడం లేదు.

గొంతెండాల్సిందే
అందోలు మండలం జోగిపేటలో రోజుకు 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లవుతున్నాయి. రోజుకు ఆదాయం రూ.లక్షల్లో వస్తోంది. కార్యాలయం ఆవరణలో కనీస సౌకర్యాలు, సరిపోను కుర్చీలు లేవు. చెట్ల కిందే వేచి ఉండాల్సి వస్తోంది. శౌచాలయాలు నిర్మించలేదు. తాగునీటికి అవస్థలు తప్పడంలేదు. చౌటకూర్‌లోనూ అదే పరిస్థితి.


ఉన్నవాటికి తాళం

జహీరాబాద్‌లో దుస్థితి

జహీరాబాద్‌లో పురుషులకు నిర్మించిన మూత్రశాలలు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారింది. రిజిస్ట్రేషన్‌, ఇతర అవసరాలకు వచ్చే వారు ఆరుబయటకు వెళ్లాల్సిందే. మహిళలకు పరిస్థితి చెప్పనక్కర్లదు. అధికారులు, సిబ్బందికి  శౌచాలయాలు ఉన్నా తాళాలు వేసి ఉండటం గమనార్హం. రోజుకు ఇక్కడ 25నుంచి 30 వరకు రిజేస్ట్రేషన్లు జరుగుతున్నాయి.


నిలబడాల్సిందే

బల్లలు సరిపోను లేక..

మునిపల్లిలో నిత్యం పది నుంచి పదిహేను వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు వస్తుంటారు. కూర్చునేందుకు బల్లలు లేక మహిళలు, పురుషులు గంటల తరబడి నిల్చోవాల్సివస్తోంది. శౌచాలయాలు లేవు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఆదాయం వస్తోంది.


పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తాం
వీరారెడ్డి , అదనపు కలెక్టర్‌, సంగారెడ్డి

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి సేవలు అమలువుతున్నాయి. అక్కడికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని పరిశీలించి ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని