logo

పది పరీక్షలకు సర్వం సిద్ధం..

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ సిద్ధమైంది. కేంద్రాల్లో డెస్కులు, వివిధ సదుపాయాల కల్పన పూర్తయింది. ఈ నెల 23 (సోమవారం) నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9.30 నుంచి

Published : 23 May 2022 02:12 IST

83 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
న్యూస్‌టుడే, సిద్దిపేట

దో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ సిద్ధమైంది. కేంద్రాల్లో డెస్కులు, వివిధ సదుపాయాల కల్పన పూర్తయింది. ఈ నెల 23 (సోమవారం) నుంచి జూన్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. అరగంట ముందు నుంచే లోనికి అనుమతించనున్నారు. గంట ముందుగానే విద్యార్థులు కేంద్రం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 83 కేంద్రాల్లో రెగ్యులర్‌ - 14,923, ప్రైవేటుగా 8 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఐదు ఫ్లయింగ్‌, 13 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరిశీలన చేయనున్నాయి. 900 మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నారు. విద్యార్థులు సహా పరీక్ష సిబ్బందికి చరవాణులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోరు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల అమరిక పూర్తయింది. నిఘా నేత్రాల ముందు ప్రశ్నపత్రాలను తెరవడంతో పాటు పరీక్ష ముగిసిన తరువాత జవాబుపత్రాలు వాటిముందే సీల్‌ చేయనున్నారు. జిల్లాలో 21 పోలీసు ఠాణాల్లో (స్టోరేజ్‌ పాయింట్లు) ప్రశ్నపత్రాలు భద్రపర్చగా.. ఎస్కార్టు నడుమ తేనున్నారు. పరీక్ష ముగిసిన తరువాత రోజువారీగా భద్రత మధ్య సంబంధిత తపాలా కార్యాలయానికి చేరవేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయం దాటిన ఐదు నిమిషాల వరకు మినహాయింపుతో అనుమతించనున్నారు. సమాచారం ఇవ్వడంతో పాటు సందేహాల నివృతికి డీఈవో కార్యాలయంలో చరవాణి నంబరు 94406 65585 అందుబాటులోకి తెచ్చారు. 24 గంటల పాటు ఈ సహాయ నంబరు పని చేయనుంది. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఆందోళనకు గురవకుండా హాజరు కావాలని డీఈవో రవికాంత్‌రావు సూచించారు.


ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి..: మంత్రి

త్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఉత్తమ ఫలితాలతో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించామని, అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు. విద్యార్థి భవితకు పదో తరగతి కీలక మలుపు అని, ఇన్నాళ్ల శ్రమను నిరూపించుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువులకు చక్కటి ఫలితాలు సాధించి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని