logo

అనుసంధానం చేయక.. ప్రయాస తప్పక..

రహదారిని రెండు వరుసలుగా విస్తరించారు.. ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో వంతెనలు సైతం నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వంతెనలకు, రహదారికి అనుసంధానం చేయకపోవడమే సమస్యగా మారింది.

Published : 24 May 2022 02:33 IST

వంతెనల నుంచి రోడ్డు వేయకపోవడంతో..

న్యూస్‌టుడే, శివ్వంపేట


గోమారం వద్ద అసంపూర్తిగా రోడ్డు ఇలా..

రహదారిని రెండు వరుసలుగా విస్తరించారు.. ఆ మార్గంలో ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో వంతెనలు సైతం నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వంతెనలకు, రహదారికి అనుసంధానం చేయకపోవడమే సమస్యగా మారింది. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినా ప్రయాస తప్పడం లేదు. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి గజ్వేల్‌ నియోజకవర్గంలోని మనోహరాబాద్‌, జీడిపల్లి వరకున్న రహదారిపై నిర్మించిన వంతెనల పరిస్థితి ఇది.

రూ.20 కోట్లతో..

శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి మనోహరబాద్‌, జీడిపల్లి వరకు ఏక వరుస రహదారి ఉండేది. ఈ మార్గంలో ప్రయాణం కష్టంగా మారడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో చెన్నాపూర్‌-పెద్దగొట్టిముక్ల గ్రామాల మధ్య, గోమారం వద్ద ఉన్న లో లెవల్‌ కాజ్‌వేలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ రోడ్డును రెండు వరుసలకు విస్తరించేందుకు సుమారు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పనులు చేపట్టి పూర్తిచేశారు. ఇందులో భాగంగా చెన్నాపూర్‌, గోమారం గ్రామాల్లో రెండు వంతెనల నిర్మాణానికి ఎఫ్‌డీఆర్‌ నిధులు రూ.3.16 కోట్లు మంజూరయ్యాయి. చెన్నాపూర్‌లో రూ.1.86 కోట్లు, గోమారంలో రూ.1.30 కోట్లు వెచ్చించి వంతెనలు నిర్మాణం చేపట్టారు.


చెన్నాపూర్‌లో కంకర తేలి..

అదుపు తప్పుతున్నాయ్‌...

చెన్నాపూర్‌, గోమారం వద్ద కాజ్‌వేలతో గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చెన్నాపూర్‌ వద్ద లో లెవల్‌ కాజ్‌వేపై నుంచి కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఇలా పలు ఘటనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం నిధులను కేటాయించి వంతెనలు నిర్మించింది. ఇవి పూర్తయ్యాయని, వెతలు తీరనున్నాయని ఆయా గ్రామాలవాసులు సంతోషపడ్డారు. కానీ ఈ రెండు చోట్ల రెండు వరుసల రహదారికి వంతెనల నుంచి అనుసంధాన దారులను నిర్మించడం మాత్రం మరిచారు. నాలుగు నెలల కిందట వంతెనలు పూర్తయ్యాయి. నిర్మాణాల సమయంలో ఓ పక్కగా వేసి మట్టి దారి వేశారు. అనుసంధానం పూర్తికాకపోవడంతో ఇంకా ఆ దారిలో రాకపోకలు సాగుతున్నాయి. వర్షం పడిందంటే ఆ ప్రాంతమంతా బురదమయం అవుతోంది. ప్రయాణానికి పాట్లు తప్పవు. ఇక రానున్నది వర్షాకాలం కావడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాలని విన్నవిస్తున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఇప్పటికే వారంలో సదరు పనులు మొదలుపెట్టాలని ఆదేశించామని తెలిపారు. త్వరగా పూర్తిచేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని