logo

భూసమస్యలపై ఏకరవు...

భూ సమస్యలను పరిష్కరించాలంటూ అత్యధికులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని అర్జీదారులు పాలనాధికారి ఎదుట ఏకరవు పెట్టారు.

Published : 24 May 2022 02:33 IST

ప్రజావాణిలో 44 అర్జీలు


వినతులు స్వీకరిస్తున్న పాలనాధికారి హరీష్‌, అదనపు పాలనాధికారి రమేశ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌

మెదక్‌, న్యూస్‌టుడే: భూ సమస్యలను పరిష్కరించాలంటూ అత్యధికులు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని అర్జీదారులు పాలనాధికారి ఎదుట ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాలనాధికారి హరీష్‌, అదనపు పాలనాధికారి రమేశ్‌ తదితరులు అర్జీలను స్వీకరించారు. మొత్తం 44 రాగా అందులో 26 భూసమస్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రజావాణికి ఆయా శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై పాలనాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే ముందస్తు అనుమతి తీసుకోవాలని, కిందిస్థాయి సిబ్బందిని పంపరాదని సూచించారు. ఇప్పటిదాకా 172 అర్జీలతో పాటు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో 61, తహసీల్దార్ల స్థాయి 152, మండల పరిషత్తు స్థాయిలో 115 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించేదుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేష్‌, జిల్లా అధికారులు శ్రీనివాస్‌, తరుణ్‌కుమార్‌, గంగయ్య, జయరాజ్‌, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్‌రావు, కేశురాం, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, ఏవో మన్నన్‌ పాల్గొన్నారు.

కొన్ని ఇలా...  * చిలప్‌చెడ్‌ మండలం సీలంపల్లిలో కాళేశ్వరం కాలువను నిర్దేశిత ప్రదేశంలో కాకుండా మరోచోట తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. కొందరు రాజకీయ పరపతిని ఉపయోగించి సర్వేనెం.308 మీదుగా వెళ్లకుండా 500 మీటర్ల దూరంలో తవ్వేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అలా చేస్తే అదనంగా ఐదు ఎకరాల భూమి కోల్పోతామని వారు వాపోయారు.

* పెద్దశంకరంపేట మండలం సురారం శివారులోని సర్వే నెం. 351లో యాభై ఏళ్లుగా వందలాది మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. 1992లో రెవెన్యూశాఖ అధికారులు పట్టా ఇచ్చారు. ఆ భూములు అటవీశాఖకు చెందినవి గెజిట్‌లో పేర్కొన్నారని, క్షేత్ర పరిశీలన చేసి తగిన న్యాయం చేయాలని రైతులు విన్నవించారు.


వీఆర్వో తప్పిదంతో భూమి కోల్పోయా..

- బాలయ్య, అబ్లాపూర్‌, పాపన్నపేట

గ్రామంలోని సర్వేనెం.60లో ఏడు గుంటలు భూమి చీకోటి బీరయ్య పేరిట నమోదైంది. కొత్తగా పాస్‌పుస్తకం అందజేసిన సమయంలో వీఆర్వో చేసిన తప్పిదంతో ఇలా జరిగింది. కొన్నేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టు తిరుగుతున్నా పరిష్కరించలేదు.


పూర్తి పరిహారం చెల్లించడం లేదు..

- ఆనంద్‌, కొండాపూర్‌, మనోహరాబాద్‌

గ్రామంలోని సర్వేనెం.129, 129/ఓలోని రెండు ఎకరాల పట్టా భూమిని కొన్నేళ్ల కిందట ప్రభుత్వ సేకరించింది. ఇందుకుగాను ఎకరాకు రూ.10.50 లక్షలు చొప్పున, మొత్తం రూ.21 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారులు రూ.14.70 లక్షలే ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని