logo
Updated : 24 May 2022 02:55 IST

చిరుగు..తరుగు..!

అధ్వాన సంచులతో నష్టం

ధాన్యం తూకమేసినా కోత..

న్యూస్‌టుడే, గజ్వేల్‌, మిరుదొడ్డి, హుస్నాబాద్‌, దుబ్బాక


దుబ్బాకలో కొనసాగుతున్న కొనుగోళ్ల ప్రక్రియ

జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అన్నదాతలకు సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల కేంద్రాలకు చిరిగిన గన్నీ సంచులు రావటంతో నిర్వాహకులు వాటికే కుట్లు వేసి నింపుతున్నారు. వడ్లు కారిపోతున్నాయంటూ అదనంగా తూకం వేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇక కేంద్రాల నిర్వాహకులు గ్రేడు నిర్ణయించి.. ధాన్యం కొనుగోలు చేసి పంపిన తరువాత మిల్లర్లు కొర్రీలు పెట్టి తక్కువ గ్రేడు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 413 కేంద్రాలు ఏర్పాటు చేసి.. సోమవారం నాటికి 1,21,544 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 6 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా వడ్లకు సంబంధించిన నగదు సకాలంలో ఖాతాల్లో జమ కావటం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.136 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి రూ.36 కోట్లు చెల్లించారు.

 
రుద్రారంలో చిరిగిన గన్నీ సంచిని చూపుతున్న రైతు

* గజ్వేల్‌ మండలం సింగాటం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తోల శ్రీనివాస్‌రెడ్డి 570 బస్తాల ధాన్యం విక్రయించారు. నిర్వాహకులు ఏగ్రేడు (క్వింటాలుకు రూ.1980)గా పరిగణించి చీటీ రాసిచ్చారు. రైస్‌మిల్లు వద్దకు పోయిన తరువాత ధాన్యం మంచిగా లేదని... బీ గ్రేడుగా తీసుకుంటామన్నారు. క్వింటాలుకు రూ.20 తగ్గించారు. మొత్తంగా రూ.6వేలు రైతు నష్టపోయాడు.

* మిరుదొడ్డి మండల పరిధి రుద్రారం గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి చిరిగిపోయిన గన్నీ సంచులు వచ్చాయి. వాటికి కుట్లు పెడుతూ ధాన్యం నింపుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం కారిపోతుందని చెప్పి బస్తాకు 41 కిలోలకు బదులు అదనంగా మరో 300 గ్రామల నుంచి కిలో వరకు ఎక్కువ నింపుతున్నారు. అలాగైతేనే కాంటా వేస్తామని చెప్పటంతో చేసేదేమీలేక రైతులు తరుగు భరిస్తున్నారు.

* దుబ్బాకలోని కొనుగోలు కేంద్రంలోనూ చిరిగిన సంచుల్లో నింపుతున్నారు. 41 కిలోలకు అదనంగా తూకం వేస్తున్నారు. గజ్వేల్‌ పరిధిలోని పలు కేంద్రాల్లో తూర్పార యంత్రాలు మొరాయించటంతో ఒక్కో బస్తా 43.5 కిలోలు నింపుతూ 41 కిలోలుగానే పరిగణిస్తున్నారు.


బీగ్రేడుగా తీసుకుంటున్నారు

- కృష్ణారెడ్డి, రైతు

తూకం వేసే సమయంలో ఏ గ్రేడుగా చెప్ఫి. మిల్లులో బస్తాలు దించే సమయంలో బీగ్రేడుగా పరిగణిస్తున్నారు. లేదంటే వెనక్కు పంపిస్తామంటున్నారు. చేసేది ఏమీలేక అంగీకరిస్తున్నాం.. దీంతో నష్టపోవాల్సి వస్తోంది.


ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం..

- హరీశ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

ధాన్యం రకాల కారణంగా గ్రేడులో మార్పు చేస్తున్నట్లుంది. కొనుగోలు సమయంలోనే గుర్తించాలని చెబుతున్నాం. కొన్ని చోట్ల ఈ సమస్య ఉత్పన్నమైనా పరిష్కరించాం. కొన్ని కేంద్రాలకు చిరిగిన సంచులు వస్తున్నాయి. వాటిని మార్చి కొత్తవి పంపిస్తాం. అదనంగా తూకం వేయడం తగదు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం. పెండింగ్‌లో ఉన్న రూ.100 కోట్లను నాలుగైదు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తాం. వచ్చేనెల 20 లోపు కొనుగోళ్లు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని