logo

ఆధునిక సేవలకు ఊతం!

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆసుపత్రిలో అనేక రకాల చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Published : 24 May 2022 02:33 IST

సిద్దిపేటలో రేడియాలజీ విభాగం అందుబాటులోకి..

న్యూస్‌టుడే, సిద్దిపేట

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆసుపత్రిలో అనేక రకాల చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌కు అనుబంధంగా రేడియాలజీ విభాగం ప్రారంభానికి సిద్ధమైంది. గత ఏడాది ఈ విభాగం మంజూరవగా.. హబ్‌కు వెనుక వైపు భవనం సుందరీకరణ, అందులో యంత్రాలు, పరికరాల అమరిక పూర్తయింది. నేడు (మంగళవారం) వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత రేడియాలజీ విభాగం సేవలు సిద్దిపేట నుంచే తొలిగా అందుబాటులోకి రానుండటం విశేషం. ప్రైవేటు దవాఖానాల్లో చిన్నపాటి పరీక్ష చేయాలంటే రూ.100 మొదలు రూ.వేలల్లో ఖర్చవుతోంది. ఈ తరుణంలో గత ఏడాది ఫిబ్రవరిలో సిద్దిపేటలో అందుబాటులోకి వచ్చిన తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌.. పేదలకు ‘వైద్య’ భారాన్ని తగ్గిస్తోంది. ఈ కేంద్రం ద్వారా 59 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిత్యం సగటున 500 నుంచి 600 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు, యంత్రాల ద్వారా 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన రక్త, మూత్ర, ఇతర నమూనాలను ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. ఈ కేంద్రానికి అనుసంధానంగా నూతనంగా రేడియాలజీ విభాగం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రూ.కోటి వెచ్చించారు. వైద్య కళాశాల నుంచి డిప్యూటేషన్‌పై ఆరుగురు వైద్యులు, సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు.

ఐదు రకాల పరికరాలు..

రేడియాలజీ విభాగం ద్వారా పలు పరికరాలు, ఉపకరణాలు అందుబాటులోకి రానున్నాయి. అల్ట్రా సౌండ్‌ స్కాన్‌, 2డీ ఎకో, ఈసీజీ, ఎక్స్‌రే, మమోగ్రామ్‌ (రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ) పరికరాలు ఏర్పాటయ్యాయి. ఆయా పరీక్షలు ప్రైవేటుగా చేయించుకోవాలంటే కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 42 ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్యుల సూచన (రిఫర్‌) మేరకు సంబంధిత సేవలు అందించనున్నారు. గ్రామీణ, ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఉపయుక్తంగా మారనుంది. కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందుబాటులోకి రానుందని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని